హుజూరాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by poll) తెరాస అభ్యర్థికి రాష్ట్రంలో ఎవరికీ రాని మెజారిటీ వస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (danam Nagendar) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కించపరచినా.. అవకులు చవాకులు పేలినా... సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలే తెరాస అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో... తెరాస పార్టీకి 60లక్షల సభ్యత్వం(trs membership) అయిందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ డివిజన్లో నూతనంగా నియామకమైన తెరాస పార్టీ బస్తీ, డివిజన్ కమిటీల కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెరాస పార్టీ తప్ప ఏ పార్టీ ఉండబోదని... అలాగని అధికారంలో ఉన్నామని ఇతర పార్టీలను భూస్థాపితం చేయాలనే ఆలోచనలో పార్టీకి లేదన్నారు. ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ తెరాస ఇంఛార్జ్ బండి రమేశ్, స్థానిక కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఏ పార్టీకి లేని విధంగా తెరాస పార్టీ 60 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ గెల్లు శ్రీనివాస్‌కి వస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెరాస తప్ప ఏపార్టీ ఉండదు. మేమేదో అధికారం ఉందికదా అని చెప్పి... ఇతర పార్టీలను భూస్థాపితం చేయాలని ప్రయత్నించడం లేదు. రాబోయే రోజుల్లో తెరాస పార్టీ ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని చెప్పి ప్రజలే కంకణం కట్టుకున్నారు. నవంబర్ 2న హుజూరాబాద్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పార్టీల నాయకులంతా కనుమరుగైపోతారు. - దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే.
ఇదీ చూడండి: Etela Rajender Fires on TRS: మంత్రి హరీశ్‌రావు, తెరాసపై ఈటల ఫైర్