యాదాద్రి ఆలయంలో అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్చిత్రాలను చెక్కించడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ ప్రచారకాంక్ష మాత్రమే కాదు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. వైభవోపేతమైన యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చి..హిందూవులను తప్పుదోవ పట్టించడమేనని ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ చిత్రాలు,గుడి ప్రాశస్త్యం తప్ప అన్య మతాల చిహ్నాలను గతంలో శిల్పులు చెక్కిన సంఘటనలు లేవని లక్ష్మణ్ గుర్తు చేశారు.
సీఎం ఆదేశాల మేరకే శిల్పులు కేసీఆర్ చిత్రాన్ని, తెరాస గుర్తుని చెక్కినట్టు స్పష్టమవుతోందని ఆగ్రహించారు. హిందూయేతర మతానికి సంబంధించిన చార్మినార్ను చిత్రించడం దుర్మార్గమని లక్ష్మణ్ మండిపడ్డారు. నిజాంకు సమాధి కట్టిన చరిత్ర తెలంగాణ బిడ్డలదని..కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశత్వానికి ఘోరీ కట్టడం పెద్ద కష్టమేమీ కాదని హెచ్చరించారు. కేసీఆర్ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి, ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : రహదారి పూర్తి చేయాలంటూ విద్యార్థుల రాస్తారోకో