KCR Maharastra tour : మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వాహన శ్రేణితో మహారాష్ట్ర పర్యటన మొదలైంది. రెండ్రోజులపాటు సోలాపూర్, దారాశివ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రగతిభవన్‌లో అల్పాహారం అనంతరం వారందరితో కలిసి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయల్దేరి వెళ్లారు.
ఈ పర్యటనకు రెండు ప్రత్యేక బస్సులతో పాటు 600 వాహనాలతో కూడిన సీఎం కాన్వాయ్ కదిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, కొందరు నేతలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మిగతా ప్రజాప్రతినిధులు, నేతలు వారి వారి వాహనాల్లో మహారాష్ట్ర బాట పట్టారు. పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్పల్లి, మియాపూర్, పటాన్ చెరు, సంగారెడ్డి జిల్లా మీదుగా జాతీయ రహదారిపై వాహనశ్రేణి మహారాష్ట్ర వైపుగా వెళ్లింది. సీఎం వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు పూలుజల్లుతూ స్వాగతం పలికారు.
సోలాపూర్‌లో బీఆర్ఎస్ సభ.. ధారాశివ్కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అక్కడి స్థానిక నాయకులు, మహిళలు సాంప్రదాయ రీతిలో హారతినిచ్చి, స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మహారాష్ట్రలోని ఉమర్గాలో మధ్యాహ్నం కేసీఆర్ భోజనం చేశారు.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సోలాపూర్‌కు బయలుదేరారు.
ఆ సమయంలో జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది. ఆ తర్వాత సోలాపూర్ చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ హోటల్ నుంచి బీఆర్ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు, సోలాపూర్ భావనారుషిపేట్లోని వారి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. సోలాపూర్‌కు చెందిన నేత భగీరథ బాల్కేతో పాటు ఇతరులు భారత్ రాష్ట్ర సమితిలో చేరనున్నారు.
కొందరు స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు అక్కడ కేసీఆర్‌ను కలవనున్నాయి. రాత్రికి సోలాపూర్‌లోనే బసచేసిన గులాబీ అధినేత... రేపు ఉదయం పండరీపూర్‌కు వెళ్తారు. అక్కడ విఠోభా రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రస్తుతం అక్కడ ఆషాడ మాసం సందర్భంగా పెద్ద జాతర జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు, అందులో ఎక్కువగా రైతులు వస్తుంటారు.
తుల్జాపూర్ శక్తిపీఠంను దర్శించుకోనున్న కేసీఆర్.. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మార్గమధ్యలో 3.30 గంటలకు దారాశివ్ జిల్లా తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తిపీఠం ‘తుల్జా భవానీ’ అమ్మవారిని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: