కేసీఆర్ ఆపధ్బందు పేరిట అర్హులైన బీసీలకు అంబులెన్సులను అందజేసే కొత్త పథకాన్ని తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన ప్రారభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాఖాపరంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే చర్యలపై మంత్రి... ఇవాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆన్లైన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బీసీ మహిళల స్వావలంబన కోసం వందకోట్లతో మరో నూతన పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు గంగుల తెలిపారు. గ్రామీణ మహిళలకు నిఫ్ట్‌లో శిక్షణ అందించటంతో పాటు 25 మంది సభ్యలు యూనిట్‌గా ప్రతి ఒక్కరికి కుట్టుమిషన్లతో పాటు అన్ని రకాల కుట్టుయంత్రాలను అందించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంత బీసీలకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు, ఒక్కో కులానికి ఐదువేల మందికి చొప్పున రజకులకు, నాయీబ్రాహ్మణులు, కుమ్మరులు, మేదర, విశ్వబ్రాహ్మణులు, సగరలు, వడ్డెరలకు వృత్తి పనిముట్లను అందించే పథకాల్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
300 కోట్ల వ్యయంతో దాదాపు 50వేల బీసీ యువతీయువకులకు ఏసీ రిపేర్, టూవీలర్ రిపేర్ తదితర వృత్తి శిక్షణలు ఇవ్వటంతో పాటు పనిముట్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామని అన్నారు. బీసీల్లోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమాల్ని రూపొందించామని... ఆయా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సలహాలు, సూచనలతో విధివిధానాలు ఖరారు చేసి ఏప్రిల్ 27న కార్యక్రమాలను ప్రారంభిస్తామని గంగుల కమలాకర్ తెలిపారు. ఏ గుర్తింపునకు నోచుకోని 17 కులాల్ని బీసీల్లో చేరుస్తామని చెప్పారు. కరోనా సంక్షోభంతో ప్రపంచం మెత్తం అతలాకుతలమైనా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని... నిరుటి కన్నా 1200 కోట్లను బీసీ సంక్షేమ శాఖకు సీఎం కేసీఆర్ అదనంగా కేటాయించారని మంత్రి వివరించారు.
2021-22 విద్యాసంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు... ప్రస్తుత స్టడీ సర్కిళ్లకు అదనంగా సిరిసిల్లలో మరో నూతన బీసీ స్టడీ సర్కిల్ ను మంజూరు చేసినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం సేకరణపై కూడా అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రతి గింజను రైతుల వద్దే కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా 6,408 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు గంగుల తెలిపారు. 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నట్లు చెప్పారు. రైతు సోదరులు 17 శాతం మించకుండా తేమతో ధాన్యాన్ని టోకన్ల వారీగా, కరోనా నిబంధనలు అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతుల సౌకర్యార్థం ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడంతో పాటు 1800 425 0033, 1967 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు గంగుల కమలాకర్ తెలిపారు.
ఇదీ చదవండి: బాలికపై వీధి కుక్క దాడి.. తల్లడిల్లిన చిన్నారి