Kavitha Reaction on Women's Reservation Bill 2023 : మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)కు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)తెలిపారు. ప్రచార మాధ్యమాలతో పాటు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్న ఆమె.. కనీసం ఇప్పుడైనా బిల్లు పెడుతున్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం పారదర్శకంగా ఉండాలని బిల్లు విధి విధానాలను దాయాల్సిన అవసరం లేదన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2014లోనే మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు కవిత గుర్తు చేశారు. బిల్లు ఆమోదంతో భారతదేశంలో మహిళలు విశ్వం ముందు తలెత్తుకొని నిలబడేలా ఉంటుందని ఆకాశంలో సగం, భూమిలో సగం అధికారంలో సగమని మహిళా లోకం నినదించినట్లు అవుతుందని కవిత చెప్పారు. అనంతరం మహిళా కార్యకర్తలతో కలిసి కవిత సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి సందడి చేశారు.
Cabinet Likely Clears Women Reservation Bill : మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ పోరాటం ఫలించిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల మహిళా బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి.. సీఎం కేసీఆర్(CM KCR) పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే అది సాధ్యమైందన్నారు.
గతంలోనూ లోక్సభలో ఎంపీగా ఎమ్మెల్సీ కవిత అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళా సాధికారతపై గళం విప్పారని సత్యవతి రాఠోడ్ గుర్తు చేశారు. మార్చిలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా సహా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. కవిత దాదాపు 47 రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.
Women Reservation Bill 2023 Telangana : మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. మహిళల తరఫున ప్రధాని మోదీ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ బిల్లు ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో మొదట పార్లమెంట్లో ప్రవేశ పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వమేనని రాణి రుద్రమ గుర్తు చేశారు. సొంత పార్టీలో, ఏ ఒక్క కమిటీలో మహిళలకు స్థానం ఇవ్వని బీఆర్ఎస్ అసలు రంగు ఉభయ సభల్లో బిల్లుకు మద్దతిచ్చేటప్పుడు బయటపడుతుందని చెప్పారు. కేవలం మహిళల ఓట్ల కోసం ఎజెండా పెట్టే ఇండియా కూటమి నిజంగా.. మహిళలకు సమన్యాయంపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో పెట్టే బిల్లుకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha Women's Bill 2023 : 'అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదు?'