రోడ్డు వెడల్పు పెంచొద్దంటూ.. కవాడిగూడ వాసుల ధర్నా! - ముషీరాబాద్ వార్తలు
కవాడిగూడ నుంచి ముషీరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి వెడల్పు 80 అడుగులకు మించకుండా ఉండాలని స్థానికులు ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులల్లో భాగంగా.. కవాడిగూడ నుంచి ముషీరాబాద్ వెళ్లే రోడ్డును 100 అడుగులకు పెంచుతున్నారు. దీనివల్ల జీవనోపాధి అయిన దుకాణాలు కోల్పోతున్నామని.. స్థానికులు, వ్యాపారులు ఆందోళన చేపట్టారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనుల వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని కవాడిగూడ వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డు వెడల్పు వంద అడుగులకు కాకుండా.. 80 అడుగులకు కుదించాలని.. విశాలంగా ఉన్న ప్రాంతంలో కావల్సినంత వెడల్పు చేయండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. రోడ్డు వెడల్పు వల్ల జీవనోపాధి కోల్పోతామని నిరసిస్తూ స్థానిక వ్యాపార సంస్థల యజమానులు, కవాడిగూడ, ముషీరాబాద్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. వంద అడుగుల రోడ్డు వద్దు.. 80 అడుగుల రోడ్డు ముద్దు.. అంటూ నినాదాలు చేశారు.
ముషీరాబాద్ నుండి కవాడిగూడకు వెళ్లే ప్రధాన రహదారిని వంద అడుగులకు వెడల్పు చేసే నిర్మాణ పనులను రెండు నెలల క్రితం చేపట్టారు. ఈ రోడ్డుకు ఇరువైపులా దాదాపు 200 చిన్నా చితక వ్యాపార దుకాణాలు ఉన్నాయి. దుకాణం ఉంటేనే.. తమ జీవనం సాగుతుందని, రోడ్డు వెడల్పులో దుకాణంలో సగం తీసేస్తే.. దుకాణం ఎలా నిర్వహిస్తామని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 అడుగులకు బదులు 80 అడుగులు రోడ్డు వెడల్పు చేస్తే.. దాదాపు 200 కుటుంబాలు వీధిన పడకుండా ఉంటాయని స్థానికులు అంటున్నారు. ఈ రహదారి హైదరాబాద్.. సికింద్రాబాద్ కు మధ్య వారధిగా ఉంటుందని.. 80 అడుగుల వెడల్పు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందంటున్నారు.