Karimnagar Pilot Girl Navya Story : ఆశలకు ఆర్ధికస్థోమత అడ్డుగా నిలిచినా లక్ష్యాన్ని వీడలేదు ఈ అమ్మాయి. ఆమె ప్రయత్నానికి అమ్మానాన్నలూ శక్తిమేర సహకరించినా.. లక్ష్యం చేరుకోవడం అసాధ్యమే అయ్యింది. కానీ దారులన్నీ మూసుకుపోయిన క్షణంలో... ప్రభుత్వంతో పాటు కొంతమంది ఆసరాగా నిలవడంతో.... చిన్ననాటి కలను సాకారం చేసుకోబోతోంది. నవ్యది కరీంనగర్ జిల్లా గర్శకుర్తి గ్రామం. తల్లిదండ్రులు రవి, పద్మ వ్యవసాయ కూలీలు. అమ్మానాన్న కూలీ పనులకెళ్తేగానీ పూట గడవని పరిస్థితి ఈమెది. చదువంతా స్థానిక ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే గడిచింది. జగిత్యాలలో డిగ్రీ చదివేటప్పుడు.... పైలట్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
చెత్తతో కారు తయారు చేసిన రైతు- ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు జర్నీ
కుటుంబ నేపథ్యం గురించి ఆలోచన రావడంతో.. మొదట్లో తటపటాయించింది నవ్య. ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్న డాక్టర్ ఆర్ ప్రవీణ్‌కుమార్ సలహాతో పట్టువిడవకుండా చదువు కొనసాగించింది. అర్హత పరీక్ష కోసం శిక్షణ పొందేందుకు.. స్థోమత లేకపోవడంతో.. సొంతంగానే సన్నద్ధమైంది. అనుకున్నట్లే అర్హత పరీక్షలో విజయం సాధించింది. ఉపకారవేతనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది పరీక్ష రాయగా... అందులో అయిదుగురే ఎంపికయ్యారు. వీరిలో నవ్య ఒకరు.
Karimnagar Navya Pilot Story : టీఎస్ ఏవియేషన్ అకాడమీలో కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం అర్హత సాధించినా.. ఆర్థిక పరిస్థితులు నవ్యని వెక్కిరించాయి. ఫ్లైయింగ్ తరగతుల కోసం.. ప్రభుత్వం బ్యాంకు ద్వారా రూ.36లక్షలకు.. రూ 18లక్షలు మంజూరు చేసినా.. గ్రౌండ్ ట్రైనింగ్‌కి మరో రూ.3 లక్షలు అవసరమయ్యాయి. లక్షలు వెచ్చించడం తమ వల్ల కాదని తల్లిదండ్రులు చెప్పేయడంతో... నిరాశపడింది. ఇక పైలట్ కావడం అసాధ్యమనే అనుకుంది. ఈ విషయం ఈనాడు దినపత్రికలో ప్రచురితమవడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రమేష్, మరికొందరు సాయం అందించారు. దీంతో తన ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం కలిగిందని చెబుతోంది నవ్య.
"చాలా ఇంటర్వ్యూల తర్వాత టీఎస్ఐఏ, బేగంపేటలో అడ్మిషన్ దొరికింది. అక్కడ జాయిన్ అవ్వాలంటే ఇంకా మూడు సబ్జెక్ట్‌లు క్లియర్ కావాలి. పైలట్ అవ్వాలి అంటే అది డబ్బుతో ముడిపడిన విషయమని నాకు తెలుసు. అప్పుడు నేను మా కుటుంబం భరించలేదేమో అనుకున్నాను. కానీ నాకు చాలా మంది నాయకులతో పాటు తోటివారు సాయం చేశారు. వాళ్ల వల్ల నేను గ్రౌండ్‌పేపర్ క్లాసెస్ తీసుకోగలుగుతున్నాను. నా కుటుంబం ఇవ్వలేని పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు ఫ్లైట్ ఎక్కలేదు. అలాగే మేము లగ్జరీగా కార్లలో తిరగలేము. ఇటీవలే సెకండ్ హ్యాండ్‌లో ఒక బైక్ కొన్నాము. ఇలాంటి స్థాయిలో ఉన్న నా తల్లిదండ్రులను ఫ్లైట్‌లో తీసుకెళ్లాలని నేను బలంగా అనుకుంటున్నాను." - వేల్పుల నవ్య, పైలట్ శిక్షణకు ఎంపికైన విద్యార్థి
కుమార్తె కల.. తమ వల్ల ఎక్కడ చెదిరిపోతుందోనని.. ఎంతో ఆందోళన పడ్డామని.. ఇప్పుడు లక్ష్యం సాధించే స్థాయికి చేరుకోవడంతో... ఆనందంగా ఉందంటున్నారు నవ్య తల్లిదండ్రులు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. పట్టువదల్లేదు నవ్య. ఫలితం గురించి ఆలోచించక.. మనవంతు ప్రయత్నం చేయాలని... అప్పుడే తప్పక అనుకున్నది సాధించే అవకాశం కలుగుతుందని అంటోంది.
"చిన్నప్పటి నుంచి నవ్య అన్నింటిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసవుతోంది. కొందరు ఎంత కష్టమైనా చదివించండి అంటున్నారు. కొందరు ఎందుకు అమ్మాయిని అంత చదివిస్తున్నారు ? పెళ్లి చేసేయండి అంటున్నారు. అది బాధనిపిస్తుంది. మేము ఇంత పెద్ద చదువు చదివించగలమని అనుకోలేదు. కానీ అందరి దయవలన ఆమె ముందుకెళ్తుంది. సీటు రావడం గొప్పగా అనిపిస్తుంది. ఉద్యోగం సాధిస్తే ఇంకా సంతోషం."- నవ్య తల్లిదండ్రులు
Makers of Milkshake Founder Rahul Inspirational Story : సాఫ్ట్‌వేర్‌కు స్వస్తి.. వ్యాపారంతో దోస్తీ