హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో కంగారూలు కనువిందు చేయనున్నాయి. ఈ వేసవిలో జపాన్‌లోని జూ నుంచి రెండు జంటల కంగారూలను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటితోపాటు రెండు మీర్‌క్యాట్స్‌ను కూడా తీసుకొస్తారు.
జంతుమార్పిడి పథకం కింద వీటికి బదులుగా ఇక్కడి నుంచి హర్షిత అనే సింహాన్ని జపాన్ పంపిస్తారు. కేంద్ర అటవీశాఖ, సెంట్రల్ జూ అథారిటీ అనుమతుల కోసం క్యూరేటరు ఎన్. క్షితిజ లేఖలు రాశారు. అనుమతులు రావడమే తరువాయి. సాధారణంగా కంగారూలు ఇరవయ్యేళ్లకు పైగా జీవిస్తాయి. జూలోని పక్షుల ఎన్‌క్లోజర్‌కు సమీపంలో గతంలో వీటి కోసం ప్రత్యేక ఆవాసం ఉండేది. ఇప్పుడు అది ఖాళీగానే ఉంది. అందులోగాని లేదా కొంగల ఆవాసాలకు సమీపంలో ఉండే ఎన్‌క్లోజర్‌లోగాని వీటికి ఆవాసం కల్పించాలని భావిస్తున్నారు. మొత్తం మీద సందర్శకులకు మరో కొత్త అనుభూతి కలుగనుంది.
ఇదీ చూడండి : ఆ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతహా...