ఆరుగాలం కష్టపడి కంది సాగు చేసిన రైతులు... పంటను విక్రయించేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత జూన్లో ఖరీఫ్ పంటలు సాగుచేసినప్పుడు వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతుల పేర్లు , వారు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగుచేశారనే జాబితా తయారు చేశారు. జాబితాల్లో పేరున్న రైతుల నుంచి మాత్రమే పంట కొనాలని మార్కెటింగ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీనికితోడు కంది రైతు తన పంటను అదే జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మాత్రమే విక్రయించాలనే షరతు విధించింది.
4 లేదా 5 క్వింటాళ్లకే మద్దతు ధర
కేంద్రం తరపున రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య( మార్క్ ఫెడ్ )ను నోడల్ ఏజెన్సీగా నియమించడం వల్ల జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలు తెరిచింది. కానీ పంట తెచ్చిన ప్రతీ రైతు నుంచి కొనకుండా తిరస్కరిస్తున్నారు అధికారులు. దీనికితోడు ఎకరానికి 4 లేదా 5 క్వింటాళ్లకే మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతకుమించి పంట పండితే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 20.70 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ అంచనా వేయగా... క్వింటాకు రూ.5800 చొప్పున 4 లక్షల 75 వేల క్వింటాళ్ల కందులు కొనడానికి కేంద్రం గతంలో అనుమతించింది. కానీ ఇంతకు మరో 3 రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చిందని మరో 5 లక్షల 70 వేల లక్షల క్వింటాళ్లు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసింది.
నెలరోజులయినా డబ్బులివ్వట్లే...
కేంద్రం నుంచి అనుమతి రాకపోతే ఏం చేయాలని మార్క్ ఫెడ్ తాజాగా ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్రం సొంతంగా కొనాలంటే 5లక్షల 70 వేల క్వింటాళ్లకు రూ. 331 కోట్లు ఇవ్వాలని కోరింది. శుక్రవారం నాటికి 2 లక్షల 55 వేల క్వింటాళ్లను కొన్నారు. వీటికి రైతులకు 150.57 కోట్లు చెల్లించాలి. కానీ కేంద్రం తరఫున పంటలను కొంటున్న 'జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ( నాఫెడ్ )' నుంచి నిధులు రాలేదని రైతులకేమీ చెల్లించలేదు. పంట అమ్మిన తరవాత నెలరోజులుగా సొమ్ము ఇవ్వకపోతే తామెలా బతకాలని అన్నదాతలు వాపోతున్నారు.
మద్దతు ధర కల్పిస్తేనే రైతులకు న్యాయం..
ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మితే సొమ్ము రాదని, తాము వెంటనే నగదు చెల్లిస్తామని రైతులకు చెప్పి వ్యాపారులు క్వింటా 4500 రూపాయల లోపే కొంటున్నారు. ఫలితంగా క్వింటాకు 1300రూపాయలు నష్టపోతున్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఏడాది కంది అధికంగా వేశారని, దిగుబడి బాగుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాయానికి చెందిన జిల్లా డాట్ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణబాబు చెప్పారు. కొందరు రైతులకు ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మహబూబ్ నగర్ మార్కెట్కు వచ్చిన కంది పంటను తాము పరిశీలిస్తే నాణ్యతగా ఉందన్నారు . కానీ నాణ్యత లేదని కొందరు వ్యాపారులు తక్కువ ధరలకు కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మద్దతు ధర కల్పిస్తేనే... రైతుల కష్టానికి సరైన న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం