Dakshina Kashi Karthika Pournami Jathara in Telangana : తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జాతర ప్రారంభమైంది. 15 రోజుల పాటు జరగనున్న ఈ బుగ్గ జాతర కార్తిక పౌర్ణమి రోజున ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో పచ్చని పంట పొలాల మధ్య ఈ క్షేత్రం వెలిసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం పవిత్ర కార్తిక మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ క్షేత్రంలో నీరు తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తోంది. ఇక్కడ శ్రీరాముడు శివారాధన చేశారని ప్రసిద్ధి. ఈ దేవాలయంలో శివుడు లింగరూపంలోనే కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు.
జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు : రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు జాతరకు వచ్చి బుగ్గ రామలింగేశ్వరుడ్ని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. స్వామికి దీపారాధన చేసి తమ కోర్కెలను కోరుకుంటే తీరుతాయని భక్తుల నమ్మకం. జాతర మొదటి రోజు ప్రముఖులు దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు జాతరకు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శ్రీశ్రీశ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ జాతరకు ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నం నుంచి మంచాల మీదుగా ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
దక్షిణ కాశీగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి : మరోవైపు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దక్షిణ కాశీగా కీర్తిస్తారు. శైవ క్షేత్రాల్లో వేములవాడ దేవస్థానానికి ప్రత్యేక ప్రాధాన్యముంది. కార్తిక మాసం వేళ భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారు. వేములవాడ ప్రాంతాన్ని చాళుక్య రాజులు 175 ఏళ్లపాటు పాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి. హిందూ, జైన, ముస్లింల ఆలయాలూ నెలకొల్పడంతో ఈ క్షేత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
మేడారం జాతరకు వేళాయే - తేదీలను ఖరారు చేసిన పూజారులు
సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!