Kaleshwaram Project Issue 2023 : మేడిగడ్డ ఆనకట్టతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై, ప్రభుత్వం శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి సమీపంలోని లక్ష్మీ బ్యారేజీ ఇందుకు వేదిక కానుంది. నలుగురు మంత్రులు రేపు మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు.
Ministers visit Medigadda Barrage Tomorrow : మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను మంత్రులు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికైన వ్యయం, ప్రాజెక్టు వల్ల కలిగిన లాభనష్టాలు, కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు సహా అన్ని అంశాలను అందులో ప్రస్తావించాలని నిర్ణయించారు. రుణాలు, చెల్లింపులు, అవసరమైన విద్యుత్ వివరాలను మంత్రులు వెల్లడిస్తారు.
మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి
మేడిగడ్డకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యలు : మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage) కుంగడం సహా సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలను మంత్రులు వివరిస్తారు. మేడిగడ్డకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యలు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, కాగ్ ప్రస్తావించిన అంశాలు, కేంద్ర జలసంఘం లేఖలను కూడా ప్రస్తావించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనులు, వ్యయం, వాటి వినియోగం, లాంటి అంశాలను వివరించనున్నారు.
"కాళేశ్వరం ప్రాజెక్టులో రకరకాల విషయాలు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అందుకే సందర్శనకు వెళ్తున్నాం. అసెంబ్లీలో చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయించబోతున్నాం. అన్నారం బ్యారేజీలో సీపేజీలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని పరిశీలించి తదనుగుణంగా చర్యలు చేపడుతాం." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
Government Focus on Kaleshwaram Project : ఆ తర్వాత మంత్రులు అక్కడే ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని అంశాలపైనా సమగ్ర సమీక్ష జరపనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుతో పాటు అన్నారం (Annaram Saraswati Barrage), సుందిళ్ల బ్యారేజీ సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. కాళేశ్వేరం నిర్మాణ సంస్థలతో పాటు ఉప గుత్తేదార్లు, నిర్మాణాలతో సంబంధం ఉన్న అందరూ సమీక్షకు హాజరయ్యేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఎన్సీని ఆదేశించారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
అన్నారం బ్యారేజీని కూడా సందర్శించనున్న మంత్రులు : ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణతో పాటు, ప్రాణహిత ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రులు స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడిగడ్డ అనంతరం అన్నారం బ్యారేజీని కూడా మంత్రులు సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారు.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ