విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదం కారణంగా పర్యావరణానికి జరిగిన నష్టాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటుచేసిన కమిటీ ఛైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి అన్నారు.
- దేశంలో స్టైరీన్ కారణంగా సంభవించిన భారీ ప్రమాదం ఇదే. దీని కారణంగా సంస్థ పరిసర ప్రాంతాల్లో పర్యావరణం కూడా భారీగా దెబ్బతింది. భవిష్యత్తులోనూ ఇందుకు సంబంధించిన నష్టాలు ఉంటాయి. వృక్షాలతోపాటు వాటి వేర్ల పరిస్థితి ఏమిటన్నది కూడా చూడాలి. భూగర్భ జలాలకు ఎలాంటి నష్టం జరిగిందో తెలుసుకోవాలి. ఆయా నష్టాలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేస్తేనే వాస్తవ తీవ్రత ఎంతన్నది తెలుస్తుంది. ఆ తర్వాతే.. పర్యావరణానికి జరిగిన నష్టాల్ని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై సమగ్రమైన సిఫార్సులు చేస్తాం.
- ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం అత్యంత కీలకం. ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో మాట్లాడాం. కొన్ని రికార్డులను పరిశీలించాల్సి ఉంది. మానవ తప్పిదమా? ఇతర అంశాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ విచారణ చేయాలి. కమిటీలోని సభ్యులందరం కూర్చుని ప్రమాదానికి కారణాలపైనా, బాధ్యులపైనా ఒక అవగాహనకు వస్తాం.
- మా కమిటీలో సభ్యుడిగా ఉన్న నీరి శాస్త్రవేత్త బాషా ఇప్పటికే పర్యావరణ అధ్యయనానికి అవసరమైన పలు నమూనాలను తీసుకెళ్లారు. వారి విశ్లేషణలో కూడా పర్యావరణానికి ఎలాంటి నష్టం జరిగిందన్న అంశం తెలుస్తుంది.
ఇదీ చదవండి: విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు