సాగు చట్టాలు రద్దు చేయాలని చేస్తున్న పోరాటాన్ని మరో స్వాతంత్య్ర ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో 12 రోజులుగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహర దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు.
పిట్ట కథలు చెబుతున్నారు: జూలకంటి
చర్చల పేరిట సంప్రదింపులు చేస్తూ పిట్ట కథలు చెబుతున్నారని జూలకంటి ఆరోపించారు. వ్యవసాయ చట్టాల రద్దు, విద్యుత్ వసరణ బిల్లు ఉపసంహరణను అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజల పెద్ద ఎత్తున భాగస్వాములై మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మార్పులు కూడా కార్పొరేట్ కంపెనీలకే అనుకూలం..
వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేస్తామంటున్న కేంద్రం.. అవి కూడా కార్పొరేట్ కంపెనీలకే అనుకూలంగా ఉంటాయని రైతు, కార్మిక, ప్రజా సంఘాలు ఆరోపించాయి. 30 రోజులుగా రైతులు ఉద్యమిస్తుంటే రాజకీయ ప్రేరేపితమంటూ కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని సంఘాలు ఆక్షేపించాయి.
ఐఏకేఎస్‌సీసీ పిలుపు మేరకు ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ పెట్రోలు, డీజిల్, గ్యాస్ దుకాణాల వద్ద.. ఆ ఉత్పత్తులు వాడకుండా బహిష్కరించాలనే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 30న ఇందిరాపార్క్ వద్ద జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు దీక్షకు హాజరయ్యారు.
ఇదీ చూడండి: నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్