Judicial custody extended to Gorantla Buchibabu in Delhi liquor policy : దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక వ్యక్తలు ఇప్పటికే అరెస్టు అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు.
సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడిగించారు. బుచ్చిబాబు కస్టడీ ముగియడంతో బుచ్చిబాబును సీబీఐ అధికారులు కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించారు. ఈ మేరకు కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగించింది. తదుపరి విచారణను మార్చి 9 వ తేదీకి వాయిదా వేసింది.
ఇక ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. దర్యాప్తులో భాగంగా బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
ఇదే కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే.. ఆప్ నేతలు ఈ లిక్కర్ స్కామ్‌కు తెరలేపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్... దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని తేల్చింది.
ఇవీ చదవండి: