ఆన్లైన్ జాబ్ పోర్టల్లో నిరుద్యోగుల వివరాలు సేకరించి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ... అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివ కృష్ణ, నవీన్ కుమార్లు అంతర్జాలంలో నిరుద్యోగుల డేటాను సేకరించి వారికి కాల్ చేసి ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపుతున్నారు. రామాంజనేయులు, వినయ్ కుమార్, శ్రీ హర్షలు మోసగాళ్ల వలలో చిక్కారు. వీరిని నమ్మిన ఈ యువకులు ఉద్యోగం కోసం విడతల వారీగా 6.75 లక్షల రూపాయలు నిందితుల ఖాతాల్లో జమ చేశారు.
కొన్నిరోజుల తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: '83' సినిమాలో రోమీదేవ్ లుక్ అదుర్స్