ఇంజినీరింగ్‌లో సెమిస్టర్ చివరి పరీక్షల తరహాలో మిడ్ టర్మ్‌గా పిలిచే అంతర్గత పరీక్షలకూ ఈసారి సప్లిమెంటరీ జరపాలని జేఎన్‌టీయూహెచ్ నిర్ణయించింది. ఇలా అంతర్గత పరీక్షలను మరోసారి నిర్వహించడం విశ్వవిద్యాలయ చరిత్రలో ఇదే తొలిసారి. దీనివల్ల బీటెక్ విద్యార్థులు సుమారు 20వేల మంది ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు.
సెమిస్టర్ పరీక్షల్లో తప్పితే ఏటా సప్లిమెంటరీ జరుపుతున్నారు. అంతర్గత పరీక్షలకు అలాంటి అవకాశం లేదు. వాటిలో మొత్తం 25 మార్కులకు 0 లేదా 1 మార్కు తెచ్చుకొని కొన్నేళ్లుగా బీటెక్ ఉత్తీర్ణులు కానివారు సుమారు ఏడువేల మంది ఉన్నారు. 12 మార్కులలోపు పొందినవారు మరో 12-14వేల మంది ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో ఒకసారి అంతర్గత పరీక్షలు నిర్వహించి దాంట్లో మార్కులు పెరిగితే సెమిస్టర్ పరీక్షల్లో మరికొన్ని తెచ్చుకున్నా ఉత్తీర్ణులవుతారన్నది ఆచార్యుల యోచన.
సగటు విద్యార్థులు గట్టెక్కడం భారమని...
బీటెక్‌లో 25 మార్కులు ఇంటర్నల్‌కు, 75 మార్కులు ఎక్స్‌టర్నల్ పరీక్షల(సెమిస్టర్)కు ఉంటాయి. అంతర్గత పరీక్షలను ఒక్కో సెమిస్టర్‌లో రెండుసార్లు జరుపుతారు. గతంలో రెండింటిలో దేంట్లో మార్కులు అధికంగా వస్తే వాటిని పరిగణనలోకి తీసుకునేవారు. ఇప్పుడు రెండింటి సగటు తీసుకుంటున్నారు. బీటెక్‌లో ఉత్తీర్ణతకు ఒక్కో సబ్జెక్టులో 40 మార్కులు తెచ్చుకోవాలి. అందులో సెమిస్టర్ పరీక్షలో కనీసం 26 మార్కులు తప్పనిసరి.
కొందరు విద్యార్థులు గతంలో అంతర్గత పరీక్షలు రాయలేదు. రాసినా ఒకటీ రెండు మార్కులే దక్కాయి. అంతర్గత పరీక్షలు రాయనివారు ఆ సబ్జెక్టులో పాస్ కావాలంటే సెమిస్టర్ పరీక్షలో 75కి 40 మార్కులు తెచ్చుకోవాలి. ఒక్క మార్కు వచ్చిన వారికి చివరి పరీక్షలో 39 మార్కులు తప్పనిసరి. అందుకే సగటు విద్యార్థులు ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణులు కావటం తలకు మించిన భారంగా మారింది. దీనిపై గత మే నెలలో జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలోనే సభ్యులు అంతర్గత పరీక్షలు జరపాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల్లో వర్సిటీ అధికారిక ఆదేశాలు జారీచేయనుంది.
ఉత్తీర్ణులు కాకున్నా.. డిప్లొమా పట్టా?
ఎన్నో ఏళ్లుగా పరీక్షలు రాస్తున్నా బీటెక్‌లో ఒకటీ రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాకపోవడం వల్ల కొందరు డిగ్రీ పట్టా పొందలేకపోతున్నారు. అలాంటివారికి వారి మార్కులు/క్రెడిట్లను బట్టి కనీసం డిప్లొమా పట్టా ఇస్తే బాగుంటుందని అధికారులు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.
- ఇదీ చదవండి: పట్టువదలని రైతన్న.. ఉద్ధృతంగా 'దిల్లీ చలో'