రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రచారంపై ఉన్న శ్రద్ధ.... పనులను పూర్తి చేసే విషయంలో లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అతి పెద్ద అవినీతిని అడ్డుకోవాలంటూ ఆయన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు బహిరంగ లేఖ రాశారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసిన ప్రభుత్వం... తిరిగి మరో టీఎంసీ నీటిని ఎత్తి పోసేందుకంటూ రూ.4657.95 కోట్ల విలువైన పనులను నామినేషన్ కింద అప్పగించి భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో ఓ జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగినా...కాళేశ్వరం పేరును ప్రస్తావించలేదని చెప్పారు. నాలుగున్నర వేలకుపైగా విలువైన పనులను టెండర్ పిలువకుండా నామినేషన్ కింద పనులు ఏలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఈ పనులను రద్దు చేయడమే కాకుండా... వాటిని ప్రతిపాదించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి గవర్నర్ను కోరారు.
ఇవీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు