జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు(jee advanced result 2021) మెరిశారు. జాతీయస్థాయిలో పదిలోపు ర్యాంకుల్లో ముగ్గురు నిలిచారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరికి చెందిన సంతోష్‌రెడ్డి నాలుగు, ఏపీలో ఒంగోలుకు చెందిన లోకేష్‌రెడ్డి అయిదు, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హృషికేష్‌రెడ్డి పదో ర్యాంకు సాధించారు. విజయనగరానికి చెందిన దివాకర్‌సాయికి 11వ ర్యాంకు దక్కింది. లోకేష్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఇంటర్ పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాశారు. ఈ నెల 3న జరిగిన అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పుర్ శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్‌లో 300కు 300మార్కులు 8మందికి లభించగా.. 100 పర్సంటైల్ 44 మందికి వచ్చాయి. అడ్వాన్స్‌డ్‌లో వీరి మధ్యే పోటీ ఏర్పడింది. దిల్లీ విద్యార్థి మృదుల్ అగర్వాల్ 360కి 348 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించాడు. అమ్మాయిల్లో దిల్లీ జోన్ విద్యార్థిని కావ్యా చోప్రా 286 మార్కులు సాధించి 98వ ర్యాంకుతో ప్రథమ స్థానం పొందింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ ఐఐటీ, బాంబేలో సీఎస్‌ఈకే ప్రాధాన్యం ఇచ్చారు.
కౌన్సెలింగ్‌కు 41,862 మందికి అర్హత
ఈసారి అడ్వాన్స్‌డ్‌కు 1,51,193 మంది దరఖాస్తు చేయగా.. 1,41,699 మంది పరీక్ష రాశారు. వారిలో అన్ని కేటగిరీలు కలిపితే 41,862 మంది జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఇందులో అమ్మాయిలు 6,452 మంది ఉన్నారు. జనరల్-16,878 మంది, ఓబీసీ-9,021, ఈడబ్ల్యూఎస్- 5,105, ఎస్‌సీ- 7,726, ఎస్‌టీ- 2757 మందితో పాటు ప్రతి కేటగిరీలో దివ్యాంగ విభాగంలో మరికొందరు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.
నాలుగో వంతు మనకే!
మొదటి 100 ర్యాంకర్లలో దాదాపు 25 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఐఐటీ హైదరాబాద్ నుంచి 100 ర్యాంకుల్లో 27 మంది, 200 ర్యాంకుల్లో 53 మంది, 500 ర్యాంకుల్లో 135 మంది ఉన్నారు. ఆ జోన్ పరిధిలో ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌లో కేరళ, తమిళనాడు విద్యార్థులు అంతగా పోటీపడరని నిపుణులు చెబుతున్నారు. ‘ఈసారి 360 మార్కులకు 89.70 శాతం, ఆపైన సాధించినవారు 10 ర్యాంకులలోపు, 79.20 శాతం, ఆపైన సాధించినవారు 100లోపు ర్యాంకులు పొందారని శ్రీచైతన్య ఐఐటీ డీన్ ఎం.ఉమాశంకర్ చెప్పారు. 58 శాతం మార్కులు వచ్చినవారు వెయ్యిలోపు ఉన్నారన్నారు.
మెరిసిన తెలుగు తేజాలు
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రామస్వామి సంతోష్‌రెడ్డి తెలంగాణ ఎంసెట్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌లోనూ నాలుగో ర్యాంకు సాధించారు. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకు 331 వచ్చాయి. తండ్రి చంద్రశేఖర్ రైతు. జేఈఈ మెయిన్‌లో 80, ఏపీ ఈఏపీసెట్‌లో 25వ ర్యాంకు వచ్చాయి. ఐఐటీ, బాంబేలో కంప్యూటర్ సైన్సులో ప్రవేశం పొందాలని భావిస్తున్నట్లు సంతోష్ వెల్లడించారు.
ఉపాధ్యాయుల కుమారుడికి అయిదో ర్యాంకు
ఒంగోలుకు చెందిన పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అయిదో ర్యాంకు సాధించారు. 360 మార్కులకు గాను 331 వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో నాలుగో ర్యాంకు.. అడ్వాన్స్‌డ్‌లో ఐదో స్థానం దక్కింది. లోకేష్‌రెడ్డి తల్లిదండ్రులు మల్యాద్రి, లక్ష్మీకాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు. తెలంగాణ ఎంసెట్‌లో 17, ఏపీ ఈఏపీసెట్‌లో 23 ర్యాంకు వచ్చాయి. ఐఐటీ బాంబేలో చేరి, కంప్యూటర్ సైన్సు బ్రాంచి ఎంపిక చేసుకోనున్నట్లు లోకేష్ వెల్లడించారు.
స్టార్టప్ పెట్టాలనే లక్ష్యం..
కడప జిల్లాకు చెందిన ఎం.హృషికేష్‌రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 323 మార్కులతో పదోర్యాంకు సాధించారు. జేఈఈ మెయిన్స్‌లో 106 ర్యాంకు రాగా.. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు మెరుగుపడింది. తెలంగాణ ఎంసెట్, ఏపీ ఈఏపీసెట్‌లో 25వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు జగదీశ్వర్, శ్రీదేవి ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులు. ఉద్యోగరీత్యా గుంటూరులో ఉంటున్నారు. ఐఐటీ బాంబేలో ప్రవేశం తీసుకోనున్నట్లు హృషికేష్‌రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత స్టార్టప్ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు.
హెడ్‌కానిస్టేబుల్ కుమారుడికి 11వ ర్యాంకు
విజయనగరానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు కుమారుడు దివాకర్‌సాయికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 11వ ర్యాంకు లభించింది. 360 మార్కులకు గాను 323 సాధించారు. జేఈఈ మెయిన్‌లో 79వ ర్యాంకు లభించగా.. అడ్వాన్స్‌డ్‌లో 11 స్థానంలో నిలిచారు. తెలంగాణ ఎంసెట్‌లో 9, ఏపీఈఏపీసెట్‌లో నాలుగో ర్యాంకు సాధించారు. ఐఐటీ, బాంబేలో సీఎస్‌ఈలో ప్రవేశం పొందాలని భావిస్తున్నట్లు దివాకర్‌సాయి వెల్లడించారు.
ఇదీ చదవండి: Tragic incident in Khammam: దుర్గామాత నిమజ్జనంలో విషాదం.. నలుగురి దుర్మరణం