హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. ఆరో వ్యవస్థాపక దినోత్సవం ఆన్‌లైన్ వేదికగా జరిగింది. ఉపకులపతి ప్రవీణ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన సమావేశానికి... అమెరికా కన్సాస్ స్టేట్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పీవీ వరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 2014లో ఆవిర్భవించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం... విద్యా, పరిశోధన, విస్తరణ రంగాల్లో సాధించిన అంశాలపై చర్చించారు. వరి, కంది, మొక్కజొన్న, పెసర, ఆముదం, ఇతర వంగడాలు 19 వరకు వృద్ధి చేసి విడుదల చేయడం, విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త వంగడాల అభివృద్ధిపై చర్చించారు.
తెలంగాణలో సహజ వనరులకు కొదవ లేదని... వ్యవసాయ అనుకూల విధానాలు అమలవుతున్న నేపథ్యంలో... విశ్వవిద్యాలయం దేశానికే ఆదర్శంగా నిలవనుందని ప్రొఫెసర్ వరప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023లో అధిక సాంద్రతతో కూడిన పంట సాగుకు అనువైన పత్తి వంగడాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జయశంకర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్‌రావు వెల్లడించారు.
ఈ అంశంపై ఇప్పటికే టెక్సాస్ విశ్వవిద్యాలయంతో కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు రైతులు, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పురస్కారాలు అందజేశారు. దేశానికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన