కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంద్రారెడ్డికి జైపాల్‌రెడ్డి రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.
దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేని నేత జైపాల్‌రెడ్డి అని మాజీ మంత్రి , తెరాస నేత నాయిని నర్సింహారెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కృషి మరువలేనదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్‌రెడ్డి పేరు ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా గాంధీతో పాటు స్పీకర్‌ను ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు కాంగ్రెస్ నేత యాదవరెడ్డి. ఆయన నుంచి రాజకీయాల్లో అనేక విషయాలు నేర్చుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే నేత జైపాల్ రెడ్డి అని భాజపా నేత చింతల రామచంద్రరెడ్డి తెలిపారు. ఏ పార్టీలో ఉన్న అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడని కితాబిచ్చారు.
ఇవీ చూడండి:జైపాల్‌రెడ్డి: దక్షిణాది తొలి ఉత్తమ పార్లమెంటేరియన్