PM Modi New Criminal Laws : దేశంలో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు పౌరుల హక్కుల రక్షకులుగా మారాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఐపీసీ సహా పాత చట్టాలను బ్రిటిషర్లు, భారత్‌లో వారి దౌర్జన్యాలు, దోపిడీలకు అనుకూలంగా రూపొందించుకున్నారని అన్నారు. మూడు చట్టాలను దేశంలో వంద శాతం అమలు చేసి మొదటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా నిలిచిన చండీగఢ్‌లో పర్యటించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆ 3 కొత్త క్రిమినల్ చట్టాలను జాతికి అంకితం చేశారు.
'పాత వ్యవస్థలో న్యాయప్రక్రియ కూడా ఒక శిక్షగానే ఉండేది. ఆరోగ్యకరమైన సమాజంలో చట్టం అనేది మనకు బలాన్ని ఇవ్వాలి. కానీ ఐపీసీలో చట్టం పట్ల భయం మాత్రమే ఉండేది. ఆ భయం బాధితుల్లోనే ఉండేది. నేరస్థుల కన్నా బాధితులలోనే చట్టాలు భయాన్ని పెంచేవి. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే సహాయం చేసేందుకు ప్రజలు భయపడేవారు. డిజిటల్ సాక్ష్యాలు-సాంకేతికత ఏకీకరణతో ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు బలం చేకూరుతుంది. కొత్త వాటి వల్ల చట్టాల్లో ఉండే లొసుగుల ద్వారా ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలు ప్రయోజనాన్ని పొందలేవు. అంతేకాకుండా పౌరులందరి ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశగా కొత్త చట్టాలు ముందడుగు వేస్తున్నాయి' అని ప్రధాని మోదీ వివరించారు.
#WATCH | Chandigarh | While addressing a programme marking the successful implementation of the three new criminal laws, PM Modi says, " the intended aim of earlier laws was to punish indians, to keep them slaves. the unfortunate thing is that even decades after independence - our… pic.twitter.com/8brDL4MI0L
— ANI (@ANI) December 3, 2024
మూడేళ్లలో బాధితులకు న్యాయం
FIR నమోదైన మూడేళ్లలో బాధితులకు న్యాయం జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. వాటితో భారత న్యాయ వ్యవస్థ, ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైందిగా మారుతుందని అమిత్ షా ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ఉదయమే నగరంలోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా వారు ఆధారాలు ఎలా సేకరిస్తారో తెలియజేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించారు. పంజాబ్ సీనియర్ ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్ ప్రధానికి కీలక విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ గులాబ్ ఛాంద్ కటారియా పాల్గొన్నారు.