Audi Cars Price Hike: దేశీయ లగ్జరీ కార్ల బ్రాండ్ సంస్థలు తమ శ్రేణిలోని వాహనాల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్, BMW కంపెనీలు తమ వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆడి ఇండియా కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమయింది.
ఈ మేరకు భారత్‌లో విక్రయిస్తున్న అన్ని రకాల ఆడి కార్లపై గరిష్ఠంగా 3 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఈ ఏడాది జూన్‌లోనే తన ఉత్పత్తుల ధరలను గరిష్ఠంగా 2శాతం మేర పెంచింది. ఇప్పుడు మరోసారి ధరలను పెంచేందుకు రెడీ అయింది.
వచ్చే ఏడాది 2025 జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. కంపెనీ ప్రస్తుతం మన దేశంలో ఆడి A4, A6, Q3, Q5, Q7 తదితర ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది. దీంతో ఈ మోడల్స్ ధరలు జనవరి నుంచి పెరగనున్నాయి. రవాణా ఛార్జీలతో పాటు నిర్వహణ ఖర్చుల ఎడ్జిస్ట్మెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
"కంపెనీ, డీలర్ల స్థిరాభివృద్ధి కోసం ఈ ధరల సవరణ అత్యవసరం. మా విలువైన కస్టమర్లపై ఈ ధరల పెంపు భారం తక్కువగా ఉండేలా చూసేందుకు మేం కట్టుబడి ఉన్నాం."- బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఇండియా హెడ్
ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్‌డౌన్ స్టార్ట్..!
ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?