Maoists Killed in Mulugu District : ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు మల్లయ్య మృతదేహం గురువారం (డిసెంబర్ 5) వరకు భద్రపర్చాలని హైకోర్టు తెలంగాణ పోలీసులను ఆదేశించింది. మిగతా మృతదేహాలపై ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే వాటిని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని హైకోర్టు పేర్కొంది. పోలీసుల బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని ఐలమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి.
మృతదేహాలపై గాయాలే సాక్ష్యం : పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్ వాదనలు వినిపిస్తూ మావోయిస్టులు తినే ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి, పన్నాగంతో పోలీసులు వాళ్లు స్పృహ కోల్పోయాక అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఆ తర్వాత పిట్టలను కాల్చినట్లుగా కాల్చి చంపేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని వాదించారు. మావోయిస్టుల మృతదేహాలపై ఉన్న గాయాలే దీనికి సాక్ష్యం అని బలమైన వాదనలు చేశారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు ఎదురుపడి మావోయిస్టులే కాల్పులు జరిపారని, దీంతో వెంటనే పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారన్నారు. ఈ కాల్పుల్లోనే మావోయిస్టులు మృతి చెందారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
నివేదికను సమర్పించండి : మృతదేహాలకు కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన నిపుణులైన వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించిందని కోర్టుకు వివరించారు. మృతుడు మల్లయ్య భార్య ఐలమ్మ సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించామన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్, ఐలమ్మను ఆసుపత్రి పరిసరాల్లోకి అనుమతించలేదన్నారు. ఈ పోస్టుమార్టంపై తీవ్ర అనుమానాలున్నాయని రీ-పోస్టుమార్టం నిర్వహించాలని సురేశ్ కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను సమర్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5 (గురువారం)కు వాయిదా వేసింది.
ములుగు ఎస్పీ వివరణ : ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారని ఎస్పీ పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ పెంచామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ టీమ్‌కు 10 నుంచి 15 మంది మావోయిస్టులు కనిపించారని, వారు పోలీసులను చూసి కాల్పులు జరిపారని తెలిపారు. లొంగిపోవాలని పలుమార్లు హెచ్చరించినా కాల్పులు ఆపకపోవడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని ఇటీవల వివరించారు.
భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి - ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు
అడవుల్లో అలజడి - ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు - భయాందోళనలో గిరిపుత్రులు