రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు మేరకు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ తమిళిసై ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు.
ఈటల మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక సమర్పించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్‌భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నివేదించారు. దీని ఆధారంగా ఈటల నుంచి వైద్య ఆరోగ్య శాఖ తప్పించాలంటూ సీఎం శనివారం గవర్నర్‌కు సిఫార్సు చేశారు. ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. తాజాగా పూర్తిస్థాయి నివేదిక రావడంతో ఆయన ఈటల పదవీచ్యుతికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భవించాక బర్తరఫ్ అయిన వారిలో ఈటల రెండో వారు. 2015లో వైద్యఆరోగ్యశాఖను నిర్వహించిన ఉపముఖ్యమంత్రి రాజయ్యను అప్పటి గవర్నర్ నరసింహన్ బర్తరఫ్ చేశారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా..
కేసీఆర్ 2001లో తెరాసను స్థాపించగా అందులో చేరిన ఈటల 2004లో జరిగిన ఎన్నికల్లో అప్పటి కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2008లో తెరాస విధాన నిర్ణయం మేరకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. 2008లో ఆయనను కేసీఆర్ తెరాస శాసనసభాపక్ష నేతగా నియమించారు. 2009లో కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్‌గా మారింది. ఆ సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. మళ్లీ పార్టీ ఆదేశానుసారం 2010లో రాజీనామా చేసి, అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆయనను సీఎం మంత్రివర్గంలోకి తీసుకొని ఆర్థికశాఖను అప్పగించారు. 2018 ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఆయనకు వైద్యఆరోగ్యశాఖ మంత్రి పదవి దక్కింది. తాజాగా బర్తరఫ్ అయ్యారు.