Income Tax Frauds Telangana : పన్నులో మినహాయింపు లభిస్తుంది అంటే ఎవరైనా ఆశపడతారు. దాన్నే ఆసరాగా తీలుకుంటున్నారు కొందరు ట్యాక్స్ కన్సల్టెంట్లు. టాక్స్ రిఫండ్ ఎక్కువ ఇప్పిస్తామంటూ, టాక్స్ రిటర్న్ సమర్పించినందుకు అధిక మొత్తంలో ఫీజులు లాగుతున్నారు. ఈ మోసాలకు పాల్పడుతున్న కన్సల్టెంట్లపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝళిపిస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సోదాల్లో భారీగా తప్పుడు ధ్రువపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో దాదాపు రూ.60 కోట్ల వరకు మోసం జరిగుండవచ్చునని అది మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
IT Returns Frauds Telangana : ఆదాయపన్ను చెల్లించే ప్రతిఒక్కరికి కొన్ని మినహాయింపులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. హోమ్ లోన్, విద్యారుణం, బీమా, వృద్ధులైన తల్లిదండ్రులకు చికిత్స వంటి వాటికి అయ్యే ఖర్చు బట్టి ఆదాయపన్నులో మినహాయింపులు లభిస్తాయి. ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుదారులు టాక్స్ కట్టేటప్పుడు మినహాయింపులకు సంబంధించిన ఖర్చులను పేర్కొనాలి. దానికి సంబంధించిన ధ్రువపత్రాలను కూడా సమర్పించాలి. వీటన్నింటిని పరిశీలించి, పన్ను మినహాయింపునకు అర్హత ఉంటే వారి చెల్లించిన పన్ను నుంచి అర్హమైన మొత్తాన్ని సంబంధిత చెల్లింపుదారులకు ఆదాయశాఖ తిరిగి ఇస్తుంది. దీన్నే ఆసరాగా తీసుకుంటున్నారు హైదరాబాద్ నగరంలోని కొందరు ట్యాక్స్ కన్సల్టెంట్లు. రిటర్న్ సమర్పించినందుకు కొంత మొత్తంలో ఫీజు వసూలు సాధారణమే అయినా కొందరు కన్సల్టెంట్లు మాత్రం పెద్దమొత్తంలో రిఫండ్ ఇప్పిస్తామంటూ చెల్లింపుదారులను ఆకట్టుకుంటున్నారు. మధ్యవర్తులను నియమించుకొని మరీ రిటర్న్‌లు సమర్పించే వారికోసం వెతుకుతున్నారు.
IT Refund Frauds Hyderabad : రిఫండ్ ఇప్పించిన మొత్తంలో నుంచి కొంత శాతాన్ని కమీషన్ ఇవ్వాలని చెబుతున్నారు. దీనికి అంగీకరించిన ఉద్యోగుల నుంచి ఫామ్-16 వంటి పత్రాలని తీసుకుని, ఆదాయపన్ను కింద మినహాయింపులు ఉన్న వాటిని తప్పుడు ఖర్చులు చూపిస్తున్నారు. మినహాయింపునకు సంబంధించి తప్పుడు పత్రాలను పుట్టిస్తున్నారు. వాటి ఆధారంగా పెద్దమొత్తంలో రిఫండ్‌కు దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఇది వరకే ఇలాంటి కుంభకోణం 2017లో వెలుగు చూసింది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో రూ. కోట్ల కొద్దీ రిఫండ్ పొందినట్లు ఇన్‌కమ్‌టాక్స్ గుర్తించింది.
ఉద్యోగులు సమర్పించిన పత్రాల ఆధారంగా హైదరాబాద్ నగరంలో వివిధ కన్సల్టెంట్ల కార్యలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక్కో కన్సల్టెంట్ వందల మంది తరఫున రిటర్న్‌లు సమర్పించినట్లు వారు గుర్తించారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఇందులో జరిగే మోసం గురించి వీరిలో చాలామందికి తెలియదని అధికారులు చెప్పారు. అధిక మొత్తంలో రిఫండ్ ఇప్పిస్తామని నమ్మబలికి, వారి పత్రాలను తీసుకుని, వాటికి అవసరమైన బోగస్ సర్టిఫికేట్లను కన్సల్టెంట్లే తెచ్చుకుంటున్నారు. చెల్లింపుదారులకు రిటర్న్‌లు సమర్పిస్తున్నారని వెల్లడైంది. సోదాలు ముగినంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి బోగస్ పత్రాలను సృష్టించినవారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదాయపన్ను శాఖ అధికారులు యోచిస్తున్నారు.
ఇవీ చదవండి:
PRATHIDWANI ఇన్‌కం టాక్స్ రాయితీలు ఎగిరి గంతేసేలా ఉన్నాయా
Harish Rao Allegations on BJP: ఉద్యోగులపై భాజపాది కపట ప్రేమ : హరీశ్
Financial planning : కొత్తగా సంపాదించడం స్టార్ట్ చేశారా?.. ఈ 5 ఫైనాన్సియల్ మిస్టేక్స్ చేయకండి!