IT raids at Devineni Avinash house: ఏపీలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపన్ను విభాగం బృందాలు మంగళవారం సోదాలు చేపట్టాయి. ఉదయం 6 గంటలకు విజయవాడలోని గుణదలలో ఆయన ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు లోపలకు ఎవరినీ రానీయకుండా సీఆర్పీఎఫ్ బలగాలను.. ప్రధాన గేటు వద్ద కాపలా ఉంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు-2లోని స్థలం డెవలప్మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్‌తో అవినాష్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించే ఐటీ సోదాలు జరిగినట్లు సమాచారం.
సోదాల విషయం తెలుసుకున్న నగర కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెయిన్ గేటు, రోడ్డుపై భారీగా గుమిగూడారు. చిన్న వయసులో నేతగా ఎదుగుతున్న అవినాష్‌పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ బయటకు వచ్చి కనిపించేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, ప్రసన్నకుమారి ఇంటిగేటు వద్ద కూర్చున్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందోనని గమనిస్తూ అక్కడే ఉండిపోయారు. రాత్రి రోడ్డుపైనే టెంట్ వేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, వెంచర్లతో పాటు ఛైర్మన్, భాగస్వామి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్దఎత్తున పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో అవినాశ్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వంశీరామ్ బిల్డర్స్ 1996 నుంచి నిర్మాణ రంగంలో ఉంది. ఐటీ శాఖకు చెందిన 25 బృందాలు విడిపోయి, ఒకేసారి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయం, రోడ్ నంబర్ 17లోని భాగ స్వామి జనార్దనరెడ్డి ఇంట్లో, నందిహిల్స్‌లోని సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టాయి. ఇంకొన్ని బృందాలు నగర శివార్లలోని వెంచర్లకు చేరుకున్నాయి. రాత్రి వేళా సోదాలు కొనసాగాయి.
ఇవీ చదవండి: