ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ సోదాలు జరిగాయి. అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలోని సాగర్ సొసైటీలో ఉన్న కార్యాలయానికి ఐదుగురు సభ్యులతో కూడిన బృందం వచ్చి ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించింది. కార్యాలయంలోని సిబ్బంది చరవాణిలను సీజ్ చేసి ఎవరిని బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేశారు. కార్యాలయంలోనే ఉన్న నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొంత మంది సిబ్బందిని ప్రశ్నించారు. మహర్షి’ సినిమా విడుదల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
సుమారు 150 కోట్ల రూపాయల బడ్జెట్తో దిల్ రాజు ప్రధాన వాటాదారుడిగా వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, పీవీపీ పతాకంపై పరమ్ వి.పొట్లూరి సంయుక్తంగా 18 నెలలపాటు మహర్షి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో లావాదేవీల చెల్లింపులు సక్రమంగా జరిగాయా లేదా అనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
ఇదీ చూడండి : శ్రీనివాసరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు