ఏ కమతంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనే వివరాల నమోదులో గందరగోళం నెలకొంది. ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టగా సాగు వివరాలు సరిగా రికార్డు చేయలేకపోతున్నట్లు గ్రామ స్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవోలు) పలువురు ‘ఈటీవీ భారత్’కు చెప్పారు. గతేడాది వరకూ పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న భూమిలో ఏయే పంటలు వేశారో దానినే పరిగణనలోకి తీసుకునేవారు. తాజాగా రైతు పేరుతో సంబంధం లేకుండా సర్వే నంబర్ల ఆధారంగా మాత్రమే నమోదు చేయాలనే విధానాన్ని వ్యవసాయశాఖ ఈ సీజన్ నుంచి అమల్లోకి తెచ్చింది. దీనివల్ల క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. భూముల అమ్మకాల సందర్భంగా ఒకే సర్వే నంబరులో ఉప విభాగాలను రెవెన్యూ శాఖ ఇస్తోంది.
ఈ నెల 5లోగా నమోదు చేసి పంపాల్సి ఉంది
ఉదాహరణకు ఒక రైతుకు 10వ సర్వే నంబరులో 5 ఎకరాలుంటే దానిని కుటుంబ సభ్యులకు పంచినా లేదా ఇతరులకు కొంత అమ్మి రిజిస్ట్రేషన్ చేయించినా వారికిచ్చిన భూమికి 10/అ, ఆ, ఇ, ఈ... అని గానీ లేదా 10/ 1, పది/2... అని గానీ ఉప సర్వే సంఖ్యను యంత్రాంగం కేటాయిస్తుంది. కానీ అన్ని ఉప సర్వే నంబర్ల వివరాలు ఆన్‌లైన్‌లో లేవని, కొన్నే ఉన్నాయని ఏఈవోలు చెబుతున్నారు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలోని ఓ సర్వే నంబరులో మొత్తం 18 ఉప సంఖ్యలుండగా ఏఈవోకిచ్చిన వివరాల్లో 8 కనిపిస్తున్నాయి. మిగిలిన వాటికి సంబంధించి భూమి వివరాలు లేనందున వాటిల్లో ఏ పంట సాగు చేశారనే వివరాలు నమోదు చేయలేకపోయారు. మరోపక్క కొందరు రైతులు ఏ రకం విత్తనాలతో పంట సాగుచేశారనే వివరాలు కూడా సరిగా చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. పంటల వివరాలను ఆన్‌లైన్‌లో ఈ నెల 5లోగా నమోదు చేసి పంపాల్సి ఉంది.
10 వేల నుంచి 12వేల ఎకరాల పర్యవేక్షణ ఎలా?
ప్రతీ ఏఈవోకు 5 వేల ఎకరాల పర్యవేక్షణ మాత్రమే అప్పజెప్పాలని సీఎం కేసీఆర్ గతంలో వ్యవసాయశాఖను ఆదేశించారు. కానీ పలుచోట్ల 10 వేల నుంచి 12వేల ఎకరాల పర్యవేక్షణ అప్పగించారు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో ఓ ఏఈవోకు 12 వేల ఎకరాలు అప్పగించారు. ఇన్ని వేల ఎకరాల్లో పంటలను తక్కువ సమయంలో పరిశీలించి నమోదు చేయడం సాధ్యం కావడం లేదని ఆయన వాపోతున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సాయం తీసుకుని పంటలను పరిశీలించాలని అధికారులు చెప్పినా వారిని తహసీల్దార్లు మండల కేంద్రాలకు పిలిపిస్తున్నారని పలువురు తెలిపారు. సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు వారికి తప్ప తమకు తెలియవని కొందరు ఏఈవోలు వాపోతున్నారు.
ఇదీ చదవండి: Covid effect on schools: ఒక్క రోజే 10 మంది ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ బోధకురాలికి కొవిడ్