కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుమారు పది లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించే పనుల కోసం నీటిపారుదలశాఖ రుణ ప్రయత్నాలు మొదలెట్టింది. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని మళ్లించేలా మొదట చేపట్టిన పనులకు, తర్వాత చేపట్టిన అదనపు టీఎంసీ పనులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు మంజూరు కావడంతో ఎక్కువ భాగం ఖర్చుచేశారు. ఈ ప్రాజెక్టుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ.70 వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయి.
రుణం ఏ పనుల కోసం?
* మల్లన్నసాగర్ నుంచి సింగూరు వరకు నీటిని మళ్లించే అనుసంధాన పనులకు ఇప్పటివరకు రుణం లేదు. ఇందులో 17, 18, 19 ప్యాకేజీల పనులున్నాయి. సుమారు 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ప్యాకేజీల కింద 3.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
* యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయకట్టుకు నీరందించడంతోపాటు బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన 15, 16వ ప్యాకేజీ పనులకు కూడా రాష్ట్ర బడ్జెట్ నిధులనే ఖర్చు చేస్తున్నారు. ఈ పనుల్లో గంధమల రిజర్వాయర్ కూడా ఉన్నా, ప్రస్తుతం నిర్మాణ పనులు జరగడం లేదు. రిజర్వాయర్ సామర్థ్యంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్యాకేజీల కింద రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
* శ్రీరామసాగర్ వెనకభాగం నుంచి నిజాంసాగర్ కాలువకు, కొండెం చెరువుకు నీటిని మళ్లించే పనులు 20, 22, 23వ ప్యాకేజీలుగా జరుగుతున్నాయి. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులు 27, 28 ప్యాకేజీలుగా ఉన్నాయి. ఈ ఐదు ప్యాకేజీల కింద 5లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది.
ఎక్కువ ఆయకట్టు ఉండే ఈ మూడు అనుసంధానాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించిన నీటిపారుదల శాఖ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకులకు ప్రతిపాదనలు పంపింది. రూ.9 వేల కోట్ల రుణం మంజూరు చేస్తే, ఇందులో 80 శాతాన్ని బ్యాంకులు ఇస్తాయి. 20శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్‌మనీ కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి సానుకూలత ఉందని, త్వరలోనే మంజూరు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: సరికొత్త రియల్ దందా.. అనుమతులు రాకముందే విక్రయాలు