విజయవాడ దుర్గగుడిలో పనిచేసేవారు ఎవరైనా సరే కాస్త తెలిస్తే చాలు... కోరుకున్న టెండర్లు దక్కుతాయి. అడిగేవారు ఉండరు... తనిఖీల ఊసే లేదు. ఏమి ఇస్తున్నారు... ఏమి తీసుకుంటున్నారనే వివరాలను రోజువారీ రిజిస్టరులో నమోదు చేయాల్సిన అవసరమూ లేదు. లాభసాటి వ్యాపారాలు చేసుకోవచ్చు. నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు. ఇలాంటి అవకతవకలపై ఇటీవల అవినీతి నిరోధకశాఖ (అనిశా) వరుసగా 5 రోజులపాటు తనిఖీలు నిర్వహించింది.
అనేక అవకతవకలను గుర్తించి... ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. దీని ఆధారంగా ఇప్పటికే 15 మంది ఉద్యోగులను కమిషనరు సస్పెండ్ చేశారు. పరిపాలనాపరంగా ఈవో సురేశ్‌బాబు వైఫల్యాలను నివేదిక బయటపెట్టింది. కొందరు ఆలయ ఉద్యోగులు స్వచ్ఛందగా వచ్చి... ఈవో పనితీరు బాగా లేదని, అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించినట్లు తన నివేదికలో అనిశా వెల్లడించింది. నివేదికలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
సహకారేతర సంస్థతో లావాదేవీలు
గుంటూరు జిల్లాకు చెందిన సంగం డెయిరీ కంపెనీల చట్టం కింద నమోదైంది. ఇది సహకారేతర డెయిరీ అయినా ఎటువంటి టెండర్లు పిలవకుండానే 2015 నుంచి 2020 వరకు నెయ్యి కొనుగోలు చేశారు. ఆడిట్ విభాగం అభ్యంతరం తెలిపాక టెండర్లు పిలిచారు.
ఎల్-1ను కాదని ఎల్-3కి...
ఆలయంలో హౌస్‌కీపింగ్, పారిశుద్ధ్య సేవలు అందించేందుకు టెండర్లు పిలిచారు. ఎల్-1ను కాదని ఎల్-3కి కట్టబెట్టారు. టెండరు పత్రంలో పేర్కొనని నిబంధనను సాకుగా చూపి ఎల్-1ను తిరస్కరించారు. ఒకవేళ ఎల్-1కు అర్హతలు లేవని భావిస్తే నిబంధనల ప్రకారం తిరిగి టెండర్లకు వెళ్లాలి.
అనుమతి లేకుండానే చెల్లింపులు
సెక్యూరిటీ, సూపర్‌వైజింగ్ కోసం 2019 సెప్టెంబరు నుంచి 2020 ఆగస్టు కాలానికి సంబంధించి మ్యాక్స్ డిటెక్టివ్, గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఈవో ఎంపిక చేశారు. ఆ తర్వాత... మరో ఏడాది కాలానికి గడువు పొడిగించాలని ఆ సంస్థ అర్జీ పెట్టుకోగా దేవాదాయశాఖ కమిషనరు తిరస్కరించారు. ఆయన ఆదేశంతో కొత్తగా టెండర్లు పిలిచారు. వీటిని పరిశీలించి... మ్యాక్స్ సంస్థకు ఇవ్వాలని ఈవో సిఫార్సు చేశారు. దీనిపై కమిషనరు ఇంకా నిర్ణయం తీసుకోకున్నా... ఇప్పటికే ఏజెన్సీకి సొమ్ము చెల్లించేయడం గమనార్హం.
ఆడిట్ చేయకుండానే బిల్లులకు ఆమోదం
ఆడిట్ అనుమతులు లేకుండానే వివిధ బిల్లులను ఆమోదించారు. దేవాదాయశాఖ కమిషనరు, స్టేట్ ఆడిట్ సంచాలకుడి మార్గదర్శకాలను ఉల్లంఘించి మరీ సరకుల కొనుగోళ్ల టెండర్లను ఖరారు చేశారు. వీటి బిల్లులను ఆడిట్ చేయించిన తర్వాతే ఆమోదించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. అన్నదానం స్టోర్స్‌కు చెందిన నగదు రిజిష్టరులో ఫిబ్రవరి 11 నుంచి ఈవో కౌంటర్ సంతకం చేయలేదు.
దర్శనం టికెట్ కౌంటర్లలో...
ఆర్జిత సేవా కౌంటర్లో రికార్డు అసిస్టెంట్ వద్ద ఉండాల్సిన నగదు మొత్తంలో తేడాలున్నాయి. ప్రతి డీసీఆర్ రశీదుపై సూపరింటెండెంట్ సంతకం చేయాల్సి ఉన్నా జరగడం లేదు. ఆన్‌లైన్ టికెట్లను సరిగా స్కాన్ చేయడం లేదు.
చీరల గోదాము, కౌంటర్లనూ వదల్లేదు
గోదాము, కౌంటర్లలో 2020 నవంబరు నుంచి 2021 ఫిబ్రవరి 17 వరకున్న వివరాలను మాత్రమే పరిశీలించగా...రూ.10,500 విలువైన రెండు పట్టుచీరలు గోదాములో కనిపించలేదు. రూ.10వేలు, రూ.8వేలు విలువైన రెండు పట్టు చీరలను ఒక వస్త్రంలో చుట్టి ఇనుప బీరువాలో పెట్టారు. చీరలను కొన్న భక్తులకు రశీదులనూ సరిగా ఇవ్వడం లేదు. ఇలా 1,336 నిజ బిల్లులు కౌంటర్‌లోని డెస్కులోనే ఉన్నాయి.
అన్నదానం స్టోర్లలోనూ అదే తంతు
సరకులకు సంబంధించిన రిజిష్టరు వంట మనిషి వద్ద ఉంది. ఇందులో వంట మనిషి ఎన్ని సరకులు తీసుకున్నారో సంతకం లేదు. వీటిని అందజేసిన ఉద్యోగి ఫిబ్రవరి 2 నుంచి వివరాలను నమోదు చేయలేదు. కూరగాయలను సరఫరా చేసే వ్యక్తి రోజుకు ఎంత పరిమాణంలో అందజేస్తున్నారు? వాటి ధరలు ఎంత? అనే వివరాలను ఇవ్వడం లేదు. నెల మొత్తానికి కలిపి ఆఖరులోనే ఇస్తున్నారు.
అన్నదానం విభాగానికి వచ్చే విరాళాలను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వేయాలి. కానీ 2016-17లో వచ్చిన రూ.54.31 లక్షల విరాళాలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేయలేదు. రూ.5వేలు లోపు విరాళాలను కరెంటు ఖాతాలో జమ చేశారు. నిబంధనల ప్రకారం ఎఫ్‌డీపై వచ్చే వడ్డీని మాత్రమే అన్నదానం కోసం వెచ్చించాల్సి ఉండగా దీనిని అతిక్రమించారు.
ఇదీ చూడండి: 243 ఎకరాల భూమికి... ఆదాయం మాత్రం రూ.50లక్షలే!