రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు నిన్న విడుదల కాగా.. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించగా.. జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కోసం ఈనెల 30 నుంచి జులై 6 వరకు కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు చివరికల్లా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటిస్తారు. రీ కౌంటింగ్, జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 30 నుంచి జులై 6 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. రీకౌంటింగ్ కోసం వంద రూపాయలు, జవాబు పత్రాల నకలు, రీ వెరిఫికేషన్ కోసం 600 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు నిన్న(జూన్ 28న) విడుదలయ్యాయి. కరోనా వల్ల గతేడాది అందరినీ ఉత్తీర్ణుల్ని చేశారు. అంతకు ముందు 2020తో పోలిస్తే మొదటి సంవత్సరం ఉత్తీర్ణత కొంత పెరిగితే ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గింది. ప్రథమ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కలిపి 4 లక్షల 64వేల 892 మంది పరీక్ష రాయగా 63.32 శాతం 2 లక్షల 94వేల 378 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కలిపి 4 లక్షల 42వేల 895 మంది పరీక్ష రాయగా... 67.16 శాతం... 2 లక్షల 97వేల 458 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి, రెండో సంవత్సరాల్లో ఈ ఏడాది కూడా బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం 54.25 కాగా.. బాలికలు 72.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 59.21 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా... 75.28 శాతం బాలికల పాసయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో సగానికి పైగా ఏ గ్రేడ్ సాధించారు. మొదటి సంవత్సరంలో లక్షా 93 వేల 925 మంది.. రెండో సంవత్సరంలో లక్షా 59 వేల 432 మందికి ఏ గ్రేడ్ దక్కింది.
ఇవీ చూడండి..