ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న.. మూడో టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలను అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈక్రమంలో సాంకేతిక సమస్యతో ఆన్‌లైన్ పేమెంట్లకు అంతరాయం ఏర్పడింది. కేవల నగదు ద్వారానే టికెట్లు విక్రయిస్తున్నారు. ఒక ఐడీపై రెండు టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల వరకు జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు చెప్పారు.
క్రికెట్ అభిమానులతో జింఖానా మైదానం కిక్కిరిసిపోయింది. జింఖానా నుంచి ప్యారడైస్ సిగ్నల్ వరకూ క్యూ లైన్ నెలకొంది. కొన్ని రోజులుగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై గందరగోళం ఏర్పడింది. అభిమానుల డిమాండ్లతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దిగొచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
బ్లాక్‌లో అమ్మితే తీవ్ర పరిణామాలు: భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయించినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ‘‘టీ20 మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరిపిస్తాం. టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయి. దీనిపై క్రీడా, పోలీస్ శాఖలు నిఘా ఉంచాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం కేవలం పది మంది అనుభవించడం కోసం కాదు. క్రీడా శాఖ కార్యదర్శితో కలిసి నేడు ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలిస్తా’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ..