కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్(Gazette Notification)లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను అందజేయాలని కృష్ణా బోర్డు ఉప సంఘం (Krishna Board Sub-Committee) రెండు రాష్ట్రాలకు సూచించింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఆదివారం కృష్ణా, గోదావరి బోర్డుల ఉప సంఘాల సమావేశాలు (Meetings of Sub-Committees of Krishna and Godavari Boards) జరిగాయి. కృష్ణా బోర్డు ఉప సంఘం కన్వీనర్ రవికుమార్ పిళ్లై నేతృత్వంలో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. తెలంగాణ, ఏపీలకు చెందిన ఇంజినీర్లు పిచ్చన్న, మోహన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సమాచారం అందజేయకపోవడంపై కన్వీనర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి ఉప సంఘం (Krishna Board Sub-Committee) భేటీ నిర్వహించనున్నారు. ఆలోగా రెండు రాష్ట్రాలు వివరాలన్నీ అందజేయాలని సూచించారు.
ఉప సంఘం సమావేశ వివరాలు...
- శ్రీశైలం ఎడమ గట్టు, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల సమాచారం ఇవ్వడంలో జాప్యంపై బోర్డు సభ్యులు తెలంగాణ ప్రతినిధులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే విద్యుత్ సంస్థ సీఎండీకి దస్త్రం పంపించామని తెలంగాణ పేర్కొనగా... ఇదే విషయాన్ని గతంలో జరిగిన సమావేశంలోనూ చెప్పారని, అయిదు రోజుల్లోగా అందజేస్తామని... వారమైనా ఇవ్వలేదంటూ ఉప సంఘం గుర్తు చేసింది. వివరాలు అందజేస్తారా, లేదా అనేది సోమవారంలోగా స్పష్టం చేయాలని సూచించింది. ఈ విషయంపై సీఎండీతో చర్చిస్తామని ఇంజినీర్లు పేర్కొన్నారు.
- తుంగభద్ర నదిపై ఉన్న రాజోలి మళ్లింపు పథకం (ఆర్డీఎస్), తుమ్మిళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతలు, నాగార్జునసాగర్ హెడ్‌వర్క్స్ వివరాలు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించినట్లు సమాచారం. సాగర్ హెడ్‌వర్క్స్ సిబ్బంది, మౌలిక వసతుల వివరాలు మాత్రం అందజేయలేదు. సాగర్ ఎడమ కాల్వ వివరాలు ఇచ్చేందుకు తెలంగాణ ముందుకురాలేదని తెలిసింది.
- తెలంగాణలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలు (ఏఎమ్మార్పీ), హైదరాబాద్ వాటర్ వర్క్స్ తదితర పథకాల పూర్తి వివరాలు కూడా తీసుకోవాలని ఉప సంఘాన్ని ఏపీ కోరింది. పులిచింతల మాదిరి జూరాలను ఉమ్మడి ప్రాజెక్టుగా గుర్తించి వివరాలు తీసుకోవాలని ఏపీ కోరగా.. ఉమ్మడి ప్రాజెక్టు కానందున అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది.
- ఏదో ఒక నిర్ణయం తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులైన ఇంజినీర్లపై ఉందని ఉప సంఘం సూచించింది. బోర్డు నిర్వహణకు సీడ్ మనీ డిపాజిట్‌పై చర్చ కూడా అసంపూర్తిగా ముగిసింది. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనలో ఉందని రెండు రాష్ట్రాల ప్రతినిధులు పేర్కొన్నారు.
- గోదావరి బోర్డు ఉప సంఘం కన్వీనర్ పాండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధ్య తరహా ప్రాజెక్టు పెద్దవాగుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు కింద ఏపీలో 85 శాతం, తెలంగాణలో 15 శాతం ఆయకట్టు ఉన్న నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలను కూడా రెండు రాష్ట్రాలు చేపట్టాలని ఉప సంఘం సూచించింది. దీంతోపాటు ఇతర ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి చేర్చాలని ఏపీ కోరింది.
నేడు గోదావరి... రేపు కృష్ణా బోర్డు సమావేశాలు
ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేర్చుతూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను అమలు చేసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గెజిట్ అమలుకు 14వ తేదీ తుది గడువు కావడంతో సోమవారం గోదావరి బోర్డు, మంగళవారం కృష్ణా బోర్డులు రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నాయి.