- ఒక్క ఎముకల ఆరోగ్యానికే కాదండోయ్. మీకు త్వరగా జబ్బులు రాకుండానూ చూస్తా. మరి నేను రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తాగా. రక్తనాళాలు బాగుండటానికి, ఇన్సులిన్ సజావుగా ఉత్పత్తి కావటానికి ఉపయోగపడతా. పిల్లల్లో టైప్1 మధుమేహం రావటానికి నేను తక్కువ కావటమూ ఒక కారణమని మీ పరిశోధకులే గుర్తించారు. మీలో నేను అంతగా లేకపోతే క్యాన్సర్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. నాడులు సరిగ్గా పనిచేయటంలోనూ ఓ చేయి వేస్తా.
- మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా నేను మీలోకి రావాలనుకుంటానా? మీరేమో పొద్దున లేవగానే బడికి పరుగులు పెడతారు. బడిలో గదుల్లోనే ఉండిపోతారు. చాలా బడుల్లో ఆడుకునే మైదానాలూ ఉండటం లేదు. ఎప్పుడో సాయంత్రం వేళల్లో ఇంటికి వస్తారు. అప్పటికి ఎండే ఉండకపోవచ్ఛు ఇంటికి వచ్చాకైనా బయటకు వస్తారా అంటే అదీ లేదు. టీవీల ముందు కూలబడిపోతారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు ముందేసుకుంటారు. ఇక మీకు ఎండ తగిలేదెప్పుడు? నేను తయారయ్యేదెప్పుడు? మీ దగ్గర ఏడాదిలో దాదాపు అన్ని రోజులూ ఎండ కాస్తున్నా చాలామందిలో నా లోపం కనిపిస్తుందంటే కారణం ఎవరో ఒకసారి ఆలోచించండి. మరో ఇబ్బందీ ఉందండోయ్. తెల్ల చర్మం గలవారితో పోలిస్తే ముదురు చర్మం ఉన్నవారిలో కాస్త తక్కువగా తయారవుతాను. అంటే మీకు ఇంకాస్త ఎక్కువ ఎండ తగలాలన్నమాట. ఈసారి ఇంట్లోనే ఆడుకుంటున్నప్పుడు ఇవన్నీ ఓసారి గుర్తు తెచ్చుకోండి. ఇక ఉంటానే..’’
- నేను మిగతా విటమిన్లలాంటి దాన్ని కాదు. పేరుకు విటమిన్‌నే అయినా నేనొక హార్మోన్‌ను. నాకు మరో ప్రత్యేకతా ఉంది. నేను మీ ఒంట్లోనే పుట్టుకొస్తాను. ఆహారం ద్వారా లభించేది పిసరంతే. మీరలా ఎండలోకి రాగానే చర్మం కింది పొరల్లోని కొలెస్ట్రాల్ అతినీలలోహిత కిరణాల సాయంతో కోలీ కాల్సిఫెరాల్‌ను తయారుచేస్తుంది. ఇదేంటని ఆశ్చర్యపోకండి. అదే నా తొలి అవతారం. అక్కడ్నుంచి కాలేయానికి చేరుకున్నాక 25 హైడ్రాక్సీ కాల్సిఫెరాల్‌గా మారిపోతా. ఆ తర్వాత మూత్రపిండాల్లో లేదంటే తెల్ల రక్తకణాల్లో విటమిన్ డిగా తయారవుతా. ఆహారం ద్వారా పొందాలంటే గుడ్డులోని పచ్చసొన, ఉప్పునీటి చేపలు, కాలేయం తినండి. పుట్టగొడుగుల్లో ఉంటాను గానీ ఎండలో పెరిగిన వాటిల్లోనే బాగా లభిస్తాను. ఇప్పుడు నన్ను కలిపి పాలు, తృణధాన్య పదార్థాలూ తయారు చేస్తున్నారనుకోండి. కావాలంటే వీటినీ తినొచ్ఛు.
కె విటమిన్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !