విహారయాత్రకు వెళ్లే పర్యాటక పడవలు ప్రమాదాలకు గురైనపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాతీయ విపత్తు నివారణ సంస్థ ముందుగానే సూచనలు చేసింది. పడవల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, భద్రత ప్రమాణాలు ఎలా ఉండాలో వివరంగా తెలిపింది. బోటు తయారీలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, తనిఖీల నిర్వహణపై 2017లోనే నిర్దేశిత ప్రమాణాలను రూపొందించి కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. పడవ నిర్వహణపై అవగాహన ఉన్న వారినే సిబ్బందిగా నియమించాలని సూచించింది. పడవ రక్షణకు సంబంధించి సిబ్బందికి కనీస ఆవగాహన కల్పించటం, బయలుదేరే ముందే పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది.
వాతావరణ శాఖతో అనుసంధానం
ప్రయాణం ప్రారంభానికి ముందే ప్రయాణికులకు సిబ్బంది సూచనలు చేయాలి. ప్రతి పడవకు బీమా ఉండి తీరాలి. బోటు యజమానులు, జలరవాణా నిర్వహణ అధికారులకు నీటి ప్రవాహం గురించి కచ్చితమైన సమాచారం ఉండాలి. వాతావరణశాఖ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పడవ వెళ్లే మార్గంలో ప్రతి 3గంటలకు ఒకసారి తాజా పరిస్థితిని అందించేలా వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని విపత్తు శాఖ సూచించింది.
పైభాగంలో పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులు
బోటును నిర్దేశిత వేగంతోనే నడపాలి. సూచించిన కాల వ్యవధుల్లో అధికారులు అనుమతులను తనిఖీలు చేయాలి. బోటు పైభాగానికి పరిమిత సంఖ్యకు మించి ప్రయాణికులను అనుమతించకూడదు. మంటలకు కారణమయ్యే పరికరాలు, పదార్థాలను బోటులో అనుమతించకూడదు. ప్రతికూల ప్రవాహం ఉన్న సమయంలో పడవలో అనుమతించిన ప్రయాణికుల సంఖ్యలో 2/3 వంతుకు మించకుండా జాగ్రత్తలు పాటించాలి. జలరవాణాశాఖలో బోటును రిజిస్టర్ చేయించి ఆ బోర్డు స్పష్టంగా కనిపించేలా నిర్దేశించిన చోట ఏర్పాటుచేయాలి.
ఈ పరికరాలు తప్పనిసరి
- బోటు తయారీలో నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి
- బోటులో ప్రాణరక్షణ కోసం అవసరమైన పరికరాలు, నిర్దేశిత సంఖ్యలో సిబ్బందిని నియమించాలి
- ఐఆర్ఎస్, ఎమ్ఎమ్డీ ఆమోదించిన ప్రాణరక్ష పరికరాలనే వినియోగించాలి. లైఫ్ జాకెట్లతో పాటు ప్రతి ఐదుగురు ప్రయాణికులకు ఒక లైఫ్ బోట్ అందుబాటులో ఉండాలి
- 25 మీటర్ల పొడవు ఉండే ప్రతి పడవలో 4 లైఫ్‌బోట్లు, 25 నుంచి 45 మీటర్ల పొడవు ఉండే పడవలో 8 లైఫ్ బోట్‌లు ఉండాలి
- పడవ ప్రమాదానికి గురైతే వెంటనే సమాచారం అందించేలా సిగ్నల్ వ్యవస్థను అందుబాటులో ఉంచాలి
- ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నెలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి
- ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తక్షణం స్పందించేందుకు క్విక్ రెస్సాన్స్ బృందాలను అందుబాటులో ఉంచాలి. వేగంగా ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రత్యేక బోటు ఏర్పాటుచేయాలి. వారి వద్ద ప్రాథమిక చికిత్స కోసం వినియోగించే మందులు, చెక్కతో తయారు సిన స్ట్రెచర్స్ అందుబాటులో ఉండాలి.
ఇలాంటి కనీస నిబంధనలను పాటించడంలోనూ బోట్ల నిర్వాహకులు వహిస్తున్న నిర్లక్ష్యమే అనేక మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతోంది. తనిఖీలు నిర్వహించడంలో అధికారుల అలసత్వం సమస్యను మరింత జటిలం చేస్తోంది.
ఇవీచూడండి: తండ్రి అస్థికలు కలిపేందుకని వెళ్లి..!