పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఎమ్మెస్సీలో 134 మంది, పీహెచ్‌డీలో 28 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు. దేశంలో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధించడంతో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందనున్నారు.
ఆణిముత్యాలు...
ప్లాంట్ సైన్సెస్ విభాగంలో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థిని వి.చంద్రిక (బీఎస్సీ అగ్రికల్చర్) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సైఫాబాద్‌లోని కమ్యూనిటీ సైన్స్ విద్యార్థులు జే.హేమలత, బి.నిహారిక... కమ్యూనిటీ సైన్స్ పీజీ విభాగంలో మొదటి ర్యాంకు పొందారు. మరో పది మంది విద్యార్థులూ పలు విభాగాల్లో 10 లోపు ర్యాంకులు సాధించారు. వి.శాలిని (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్), కేసీ సాహూ, చావ నీలకంఠ, రాజరుషి (ఎంటమాలజీ), ఎ.సాయిరాం (వాటర్ సైన్స్, టెక్నాలజీ) జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు పొందారు. కమ్యూనిటీ సైన్స్ విభాగంలో పి.హరిచందన 3వ ర్యాంకు, దివ్యశ్రీ మహపాత్ర 2వ ర్యాంకు, లోపముద్ర మహపాత్ర 4వ ర్యాంకు పొందారు.
వీసీ అభినందన
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అభినందించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేయాలనుకునే విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకుంటున్నారని అన్నారు. వివిధ విభాగాల్లో విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి జాతీయ స్థాయిలో కీర్తిని మరోసారి తీసుకొచ్చారని హర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ వ్యవసాయ కళాశాలల్లో జేఆర్‌ఎఫ్ సెల్ ద్వారా నిపుణులైన ఆచార్యులు నిరంతరం నాణ్యమైన శిక్షణ, మంచి అవగాహన కల్పించడం వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాయని వీసీ సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'ప్రచారాల్లో వ్యక్తిగత దూషణలను తీవ్రంగా పరిగణిస్తాం'