కరోనా చికిత్స ఔషధాలకు ఏపీఐ రూపకల్పనలో ఐఐసీటీ ముందంజలో ఉంది. పంచవ్యాప్తంగా గుర్తించిన ఐదు ఔషధాలకు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్స్(ఏపీఐ) రూపొందించడంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. కొవిడ్-19 ఔషధాలపై ప్రయోగాల్లో ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టులు డా.రాజిరెడ్డి, డా.ప్రథమ ఎస్ మయంకర్తో పాటు విద్యార్థులు, సాంకేతికత నిపుణులు రెండు నెలలుగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పరిశోదనలో పురోగతిని ‘ఈనాడు’తో పంచుకున్నారు.
* ఎబోలా, ఇన్‌ఫ్లుయంజా, ఇతర వైరస్ సంబంధిత అంటువ్యాధుల చికిత్సకు వాడే ఔషధాలు కరోనా వైరస్‌పై ఏ మేరకు పనిచేస్తున్నాయనే సమాచారంపై అధ్యయనం మొదలెట్టాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఐదు ఔషధాలు ఫావిపిరవిర్, రెమిడిసివిర్, ఉమిఫెనొవిర్, బొలాక్సవిర్, క్లోరోక్విన్/హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు సంబంధించిన మాలిక్యుల్స్ అభివృద్ధిపై దృష్టిపెట్టాం.
* ఇప్పటికే కొవిడ్‌పై పనిచేస్తాయని గుర్తించిన ఔషధాల ఏపీఐని ప్రయోగశాలలో అభివృద్ధి చేశాం. ఇందుకు కావాల్సిన ముడిపదార్థాల కోసం దిగుమతులపై ఆధారపడకూడదని స్థానికంగా లభించే రసాయనాలను ఉపయోగించుకున్నాం. చౌకలో ఉత్పత్తి ప్రక్రియను అభివృద్ధి చేశాం. ఫలితంగా ఔషధంగా మార్కెట్లోకి వస్తే ధర చాలా తక్కువగా ఉంటుంది.
* ఫావిపిరవిర్ జెనరిక్ ఔషధం. ఏపీఐ తయారీలో ఆరు వారాల్లోనే పురోగతి సాధించాం. ఇతర పద్ధతుల్లో ఏపీఐని అభివృద్ధి చేసి సాంకేతికతను ఒక ఔషధ కంపెనీకి బదలాయించాం. ఆ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)ని సంప్రదించగా మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు ప్రయోగ పరీక్షలకు సిఫారసు చేసింది. రెమిడిసివిర్, ఉమిఫెనొవిర్, ఔషధాల తయారీకి అవసరమైన ఇంటర్మీడియట్స్(ముడిపదార్థాల తర్వాతి దశ) తయారీ విధానాన్ని అభివృద్ధి చేశాం. ఈ సాంకేతికతలను కొన్ని ఇతర ఔషధ సంస్థలకు బదిలీ చేసే పనిలో ఉన్నాం.
ఎప్పటికి అందుబాటులోకి..
కొవిడ్‌పై ఐఐసీటీ అభివృద్ధి చేసిన ఏపీఐ పలు దశలు దాటుకుని త్వరలోనే ఔషధంగా భారత మార్కెట్లోకి వస్తుందనే విశ్వాసం మాకుంది. అలాంటి వాటిలో ఫావిపిరవిర్ ఒకటి. ఇది మార్కెట్లోకి రావడానికి ముందు ప్రయోగ పరీక్షలు, డీసీజీఐ సిఫారసులపై ఆధారపడి ఉంటుంది. ప్రయోగ పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉంటే ఒకటి రెండు నెలల్లో మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని విశ్వసిస్తున్నాం. - డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ ప్రథమ
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు