కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. వైరస్ కారణంగా గత కొంత కాలంగా నిలిచిపోయిన హైదరాబాద్- శ్రీశైలం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తిరిగి ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి రివర్ క్రూయిజ్‌లో శ్రీశైలం వెళ్లేందుకు ఈ ప్యాకేజీ డిజైన్ చేశారు. రెండు రోజుల ఈ టూర్‌కి పెద్దవారికి రూ. 3,499, పిల్లలకు రూ. 2800 చొప్పున వసూలు చేయనున్నట్టు వివరించారు.
ఈ టూర్లో భాగంగా నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం ఆలయం, సాక్షి గణపతి ఆలయం, శ్రీశైలం డ్యామ్ సైట్, పాతాళగంగ, ఫరీదాబాద్ అడవులను చూపనున్నారు. ఈ ప్యాకేజీలో రవాణాతో పాటు.. ఆహారం, రాత్రి బస ఉంటుందని పేర్కొన్నారు.
సోమశిల మీదుగా మరో ప్యాకేజీ
అలాగే హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలానికి వెళ్లే మరో ప్యాకేజీని కూడా మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమశిల, శ్రీశైలం, సాక్షి గణపతి ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళగంగ, ఫరీదాబాద్ అడవులను చూసే అవకాశాన్ని పర్యాటకులకు, కల్పిస్తున్నారు. ఇక గ్రూపులుగా వెళ్లాలనుకునే వారికి ప్రత్యేకంగా ట్రిప్పులు నిర్వహించనున్నట్టు తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటూనే అటు యాత్రికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర పథకాల్లో అధికశాతం కేంద్రం భాగస్వామ్యంతోనే అమలు'