Hyderabad Roads Empty During Dussehra Festival : ఎప్పుడు బిజీ బిజీగా ఉండే భాగ్యనగర రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ట్రాఫిక్ లేకపోవడంతో.. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అసలు పెద్దగా పని లేకుండా పోయింది. హైదరాబాద్ నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా సెలవు(Dussehra Festival Holidays)ల కోసం ఉత్సాహంగా గడిపేందుకు పట్టణం వాసులంతా పల్లెలకు క్యూ కట్టారు. ఏడాది పాటు కన్నవారికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే వాళ్లంతా పెద్ద పండగను అందరితో కలసి జరుపుకునేందుకు తరలివెళ్లారు. సాధారణంగా దసరా, నవరాత్రి పండుగ అంటేనే హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అయిపోతుంది.
దసరా సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు(Dussehra Festival Celebrations 2023) ప్రకటించడంతో అధిక శాతం కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తమ స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. దీనికి తోడు శనివారం, ఆదివారం, సోమవారం తోడు కావడంతో ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కలిసొచ్చింది. అందుకు ఈ ఏడాది భారీగా జనం పల్లెలకు క్యూ కట్టారు. విశ్వనగరం హైదరాబాద్‌లో నిత్యం అత్యంత రద్దీగా ఉండే హయత్ నగర్, ఎల్బీ నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, మలక్‌పేట, కోఠి, నెక్లెస్‌రోడ్డు, నాంపల్లి, అమీర్‌పేట, బేగంపేట, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, మియాపూర్, అబీడ్స్, శాసనసభ, సచివాలయం, బషీర్‌బాగ్, అంబర్‌పేట, ఉప్పల్ తదితర ప్రాంతాలన్నీ వాహనాలు, ప్రజలు లేక బోసిపోయాయి.
Dussehra Festival Celebrations 2023 : జనాల రద్దీ కాకుండా వాహనాల రాకపోకలు సైతం భారీగా తగ్గిపోవడంతో ప్రశాంత వాతావరణం నడుమ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాంతో ఎప్పుడు ట్రాఫిక్ జామ్‌లతో కిక్కిరిసి పోయి కనిపించే హైదరాబాద్ నగరం సాధారణానికి భిన్నంగా ఈ మూడు నాలుగు రోజులు కనిపిస్తుంది. నగర రోడ్లు పూర్తి నిర్మాణుష్యంగా మారాయి. ప్రధాన రోడ్లపై జనం అలికిడి కనిపించడం లేదు. వాహనాల శబ్ద కాలుష్యం కూడా అస్సలు లేదని జంట నగర వాసులు తెలిపారు.
సాధారణంగా ఏ పండుగ వచ్చినా సరే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు హైదరాబాదీలు క్యూ కడుతుంటారు. ప్రస్తుతం వాహనాల తాకిడి హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై పెరిగింది. ఈసారి, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇసుక వేస్తే రాలనంత మంది ఉండడంతో ప్రత్యక్ష నరకానికి ప్రయాణికులు గురయ్యారు. ఇక విమానాల ధరలు ఆకాశాన్ని తాకాయి. సొంత వాహనాల్లో బయలుదేరిన వారికి టోల్ గేట్ల, ట్రాఫిక్ జామ్‌లు మరో రకమైన హింస చవిచూపించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఈజీ ట్రాఫిక్ ఫ్లో ఉండేలా అదనపు సిబ్బందిని మోహరించడం విశేషం.