Hyderabad ponds issues : శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరు. కానీ, రాజధానితోపాటు చుట్టుపక్కల ఉన్న జలవనరుల పరిరక్షణ దశాబ్దాలుగా ప్రభుత్వాలకు సవాల్‌గానే మారింది. ఓ వైపు పరిరక్షణ చర్యలు చేపడుతుండగా.. ఆక్రమణల పరంపర మరో వైపు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడానికి ప్రధాన కారణం చెరువుల ఆక్రమణలేనని నిపుణులు సైతం వెల్లడించారు. తాజాగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణ బాధ్యతను నిర్మాణ సంస్థలు, డెవలపర్స్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఏ నేపథ్యంలో ఈ మేరకు ప్రయోజనం కలుగుతుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రజాభాగస్వామ్యంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ క్రతువు కొనసాగితేనే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చెరువుల పరిరక్షణ బాధ్యతలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, చెరువుల పరిరక్షణ కమిటీలు భాగస్వాములుగా ఉన్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం, పలు ఇతర కారణాలతో జలవనరుల పరిరక్షణ ప్రశ్నార్థంగా మారింది.
నోటిఫై నామమాత్రంగానే..
హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో 3,532 చెరువులు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిని నిర్ణయించడంతోపాటు, బఫర్ జోన్‌ను నిర్దేశించడం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని సర్వే నంబర్లును నోటిఫై చేయడం తదితర చర్యలు చేపట్టి తుది నోటిఫికేషన్‌లు పూర్తి చేయాలి. కానీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రాథమిక నోటిఫికేషన్ పూర్తయిన చెరువులు 2139, పూర్తి స్థాయిలో సర్వే చేసి నోటిఫై చేసినవి 226 మాత్రమే.
2010లో ఏర్పాటైన చెరువుల పరిరక్షణ కమిటీల బాధ్యతలివీ
* హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులను గుర్తించడం
* ప్రతి చెరువుకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను స్పష్టం చేయడం
* ఆక్రమణల పరం కాకుండా ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని పరిరక్షించడం
* పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం

నిర్మాణ సంస్థలకు అప్పగిస్తే మరింత నష్టం
వాల్టా చట్టం ప్రకారం చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైదరాబాద్‌లో వందలాది చెరువులు కనుమరుగయ్యాయి. ఉన్నవాటిని పరిరక్షించేందుకు పురపాలకశాఖ చర్యలు తీసుకోకుండా నిర్మాణ సంస్థలకు ఆ బాధ్యత అప్పగిస్తే మరింత నష్టం జరుగుతుంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, కమిటీలు తప్పుకోవడం సరికాదు. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. స్థానికులను భాగస్వాములను చేసి చెరువులు, కుంటల్ని కాపాడాలి.
-పద్మనాభరెడ్డి, కార్యదర్శి, సుపరిపాలన వేదిక
ఆ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి
చెరువుల పరిరక్షణ ప్రభుత్వం ద్వారా జరిగితేనే సమర్థంగా ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగిస్తే జవాబుదారీతనం ఉండదు. స్థానిక ప్రజలు, నిస్వార్థంగా పనిచేస్తున్నవారినీ ఈ క్రతువులో పాల్గొనేలా చేయాలి.
- సునీల్ చక్రవర్తి, ఇబ్రహీం చెరువు పరిరక్షణ కమిటీ
ఇదీ చదవండి: Nutrition Garden: సత్ఫలితాలిస్తోన్నా... అంగన్వాడీల్లో కనిపించన న్యూట్రిషన్ గార్డెన్లు..!