Anti Drug Committees in Telangana Colleges: గోవా నుంచి మాదక ద్రవ్యాలను హైదరాబాద్‌కు తరలిస్తున్న ముఠాలపై హైదరాబాద్ పోలీసులు గట్టి నిఘాపెట్టారు. ఎడ్విన్, బోర్కర్‌తో పాటు మరికొంత మందిని హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఏజెంట్లను ఏర్పాటుచేసుకొని హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ముంబయి, పుణె, దిల్లీలాంటి మహానగరాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కళాశాలలకు చెందిన విద్యార్థుల జాబితా నిందితుల వద్ద లభించినట్లు వెల్లడించారు.
కొరియర్, డార్క్ వెబ్ ద్వారా విద్యార్థులు డ్రగ్స్ తీసుకొని వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారణైందని తెలిపారు. జాబితాలోని కొందరు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించగా.. కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యా సంస్థల్లో వెళ్లూనుకుపోతున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు నూతన ప్రణాళిక రచించారు. అవగాహన కల్పించే విధంగా హైదరాబాద్ పోలీసులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ: ప్రతి విద్యాసంస్థల్లోనూ మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తూర్పుమండల పరిధిలోని 55 డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐదుగురికి తగ్గకుండా సభ్యులతో కమిటీలు వేశారు. అందులో కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులతో పాటు, ముగ్గురు విద్యార్థులుంటారు.
ఆదిలోనే అడ్డుకునే అవకాశం: కళాశాలల్లో తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించేలా నియమావళి రూపొందించారు. ఏవరైనా విద్యార్థి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తెలియగానే వెంటనే కమిటీ దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు సమాచారమిచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా డ్రగ్స్ వినియోగాన్ని ఆదిలోనే అడ్డుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడికి గురై, హోదాగా భావించి, మాదకద్రవ్యాల బారిన పడే వాళ్లు క్రమంగా అందుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పాఠశాలల్లోనూ మాదకద్రవ్యాల వ్యతిరేక కమిటీలు వేయించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాటివల్ల కలిగే నష్టాలపై పాఠశాల దశ నుంచే విద్యార్థులకు అవగాహన ఉంటే ఆశించిన ఫలితాలుంటాయని భావిస్తున్నారు.
"వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డ్రగ్స్ దందాలో పాల్గొంటున్నారు. ఈ మేరకు మాకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు డ్రగ్స్‌కు బానిస అవుతున్నారు. అందుకే కాలేజీల్లో, పాఠశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా వాటి బారినపడకుండా చూడవచ్చు." -సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ఇవీ చదవండి: