దేశంలో డ్రైవర్ రహిత సేవలను ప్రారంభించి దిల్లీ మెట్రో రైలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సాంకేతికతను దేశంలోకి మొదట తీసుకొచ్చింది మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ డ్రైవర్‌తోనే మెట్రో నడుపుతున్నా.. 2014 డిసెంబరులో నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీ. మార్గంలో డ్రైవర్ లేకుండానే విజయవంతంగా నడిపి దేశంలో కొత్త అధ్యయనానికి తెరతీసింది.
అత్యాధునిక ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ)ని దేశంలోనే హైదరాబాద్ మెట్రో తొలిసారిగా అమలుచేసింది. రేడియో సమాచార అధారిత వ్యవస్థ రైళ్ల గమనాన్ని నిరంతరం ప్రసారం చేస్తుంటాయి. ఈ మొత్తం పక్రియ ఉప్పల్ డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్(ఓసీసీ) నియంత్రిస్తుంది. ‘దిల్లీ మెట్రో తరహా మనమూ పూర్తిస్థాయిలో డ్రైవర్ రహిత మెట్రో నడపాలంటే స్టేషన్లను ఆధునికీకరించాలి’ అని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు.
ప్రమాదాలకు ఆస్కారం తక్కువ
మెట్రో రైలులోని సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం జోన్లుగా విభజిస్తారు. జోన్ కంట్రోలర్ అనే వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. ప్రతి రైలు తన ఉనికిని, గమనాన్ని, వేగాన్ని మిగిలిన రైళ్లకు, వ్యవస్థకు తెలియజేస్తూ తన వేగాన్ని నియంత్రించుకుంటుంది. ఆటోమెటిక్ ట్రైన్ సూపర్‌విజన్, ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్, జోన్ కంట్రోలర్ వంటి అనేక ఉప వ్యవస్థలు మెట్రో రైళ్లు ఒకదానితో మరోటి ఢీకొట్టకుండా నియంత్రిస్తాయి. ఈ వ్యవస్థతో హైదరాబాద్ మెట్రోకు ప్రతి 90 సెకన్లకు ఒక రైలు నడిపే సామర్థ్యముంది.
- ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మహిళకు యూకే వైరస్