హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు కారిడార్లలో రైళ్ల కొంత ఆలస్యంగా నడువగా... మరికొన్ని కారిడార్లలో సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం కారిడార్లలో రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి.
అసెంబ్లీ నుంచి అమీర్పేట్ మార్గంలో అరగంటపాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్లో అరగంట నుంచి రైళ్ల కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నగరంలో లాక్ డౌన్ నుంచి ఇప్పటికి ఎంఎంటీఎస్ రైళ్లు పునరుద్ధరించకపోవడం... ఆర్టీసీ కూడా అన్ని మార్గాల్లో గతంలా సేవలు అందించకపోవడం వల్ల మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
రోడ్లపై కూడా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం... ట్రాపిక్ ఎక్కువ కావడం వల్ల ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యతోనే మెట్రో సేవలు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా వాటిని పునరుద్ధరిస్తున్నట్లుగా మెట్రో అధికారులు వెల్లడించారు.