Hyderabad Metro: హైదరాబాద్లో మెట్రో ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఇవాళ్టి నుంచి మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లనున్నాయి. ఇప్పుడున్న వేగం కంటే మరో 10 కిలోమీటర్ల అదనపు వేగంతో వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి లభించింది. రైళ్ల వేగం, భద్రతను గతనెల కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పరిశీలించారు. వేగం పెంచడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గనుందని మెట్రో అధికారులు తెలిపారు.
నాగోల్ -రాయదుర్గం 6 నిమిషాలు, మియపూర్-ఎల్బీనగర్ 4 నిమిషాలు, జేబీఎస్ -ఎంజీబీఎస్ 1 నిమిషం ప్రయాణ సమయం ఆదా కానుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తుండగా.. తాజా నిర్ణయంతో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి స్టేషన్ వద్ద ఆగడంతో ఈ వేగం ఓవరాల్గా కొంత వరకు తగ్గనుంది.
ప్రతి ఆదివారం సూపర్ సేవర్ ఆఫర్: ఇకపై సెలవు రోజుల్లో అపరిమిత ప్రయాణ అవకాశాలను అందిస్తున్న సూపర్ సేవర్ ఆఫర్ ఇవాళ కూడా కొనసాగనుంది. సెలవు రోజుల్లో 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఎన్నిసార్లైనా ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద సూపర్ సేవర్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్డుతో హైదరాబాద్ జంట నగరాల్లోని 57 మెట్రో స్టేషన్ల నడుమ ఒక రోజులో ఎన్నిసార్లైనా తిరగవచ్చు. సంవత్సరంలో వర్తించే 100 సెలవు దినాల్లో మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంచారు. మెట్రోరైల్ ప్రయాణీకులు మొదటి సారి 50 రూపాయలతో సూపర్ సేవర్ కార్డును తీసుకోవాలని సూచించారు. అనంతరం 59 రూపాయల రీఛార్జి చేసుకోవడం ద్వారా మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ టాపప్ విలువ కేవలం వర్తించేటటువంటి సెలవు దినాలకు మాత్రమే పరిమితమని.. ఆ రోజు మాత్రమే దానిని వాడుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. మళ్లీ తర్వాత మరో సెలవు రోజులో కేవలం 59 రూపాయలతో రీఛార్జి చేసుకుని ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:Metro Super Saver Card: 'రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు!.. ఎలాగంటే..'