Hyderabad Metro employees protest: హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద టికెటింగ్ ఉద్యోగులు ధర్నాలకు దిగి తమ నిరసన తెలుపుతున్నారు. రెడ్ కారిడార్ సిబ్బందితో పాటు బ్లూ కారిడార్ సిబ్బంది కూడా ధర్నాలో పాల్గొన్నారు. మెట్రో సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మెట్రో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు. దీనిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఓవైపు హైదరాబాద్ మెట్రో సిబ్బంది తమకు జీతాలు పెంచాలంటూ నిరసన చేస్తుండగా మరోవైపు మెట్రో నిర్వాహకులు స్పందించారు. సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. వారి సమస్యలు తెలుసుకోవడానికి చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నగరంలో సమయం ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తున్నాయని.. మెట్రో ఆపరేషన్ నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదని తెలిపారు.
మరోవైపు మెట్రో టికెటింగ్ సిబ్బందితో కియోలీస్ ఏజెన్సీ ప్రతినిధుల చర్చలు జరుపుతున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఐదుగురు టికెటింగ్ సిబ్బందితో చర్చిస్తున్నారు. ఓవైపు చర్చలు జరుగుతున్నా.. మెట్రో స్టేషన్ వద్ద ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇవీ చదవండి: