Pav Bhaji Masala Recipe in Telugu : నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌లో పావ్ భాజీ ఒకటి . పావ్ అంటే బన్ను, భాజీ అంటే కూరగాయలు. వీటితో తయారయ్యే పావ్ భాజీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో కదూ! అయితే, పావ్ భాజీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నింటికంటే ముఖ్యంగా మసాలా పొడి చాలా అవసరం. అది గనుక సిద్ధంగా ఉంటే ఎప్పుడంటే అప్పుడు సింపుల్‌గా పావ్ భాజీని తయారు చేసుకొని వేడివేడిగా తిని ఆనందించవచ్చు. మరి, ఆ పావ్ భాజీ మసాలా పొడి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మీరే చాలా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ధనియాలు - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - రెండున్నర టేబుల్‌స్పూన్లు
- మిరియాలు - 2 చెంచాలు
- ఆమ్చూర్ పౌడర్ - 1 టేబుల్‌స్పూన్
- సోంపు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 12
- లవంగాలు - 10
- యాలకులు - 4
- దాల్చినచెక్క - 3 అంగుళాల ముక్క
- నల్ల యాలకులు - 2
- బిర్యానీ ఆకులు - 2
- స్టార్ మొగ్గ - 1
- డ్రై జింజర్ పౌడర్ - అర చెంచా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని దాల్చినచెక్క, స్టార్ మొగ్గ, ధనియాలు, నల్ల యాలకులు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఆ తర్వాత అదే కడాయిలో లవంగాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, యాలకులను వేసి మంచి వాసన వచ్చే వరకూ వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- ఆపై ఆమ్చూర్ పౌడర్, డ్రై జింజర్ పౌడర్లను కూడా కొన్ని క్షణాల పాటు వేయించి స్టౌ ఆఫ్ చేసి దింపేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకుని చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఈ పొడిని తడి లేని, గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకుంటే చాలు. పావ్ భాజీ మసాలా రెడీ! మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు పావ్ భాజీ ప్రియులైతే ఈజీగా ఇలా అందులోకి కావాల్సిన మసాలా పొడిని సిద్ధం చేసుకోండి.
- ఇక మీకు తినాలనిపించినప్పుడు ఉల్లి, టమాటా, క్యాప్సికం, బంగాళదుంప, బఠాణీలతో చేసే భాజీలో ఈ మసాలాను యాడ్ చేసుకుంటే చాలు. ఆపై పావ్లను వెన్నతో వేయించి భాజీతో తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ సూపర్‌గా ఉంటుంది!
ఇవీ చదవండి :
ముంబయి స్ట్రీట్ స్టైల్ 'పావ్‌భాజీ' - ఇలా చేస్తే నిమిషాల్లోనే ప్రిపేర్! - పైగా టేస్ట్ సూపర్!
వంటసోడా లేకుండా అద్దిరిపోయే "అరటికాయ బజ్జీలు" - ఇలా చేస్తే నూనెె తక్కువ, రుచి ఎక్కువ!