సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ కలిసి పర్యటించారు. డివిజన్లోని అంబేడ్కర్ నగర్ నాలాపై వెలిసిన అక్రమ నిర్మాణాల గురించి మేయర్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలంలో ముందస్తు చర్యల్లో భాగంగా డివిజన్లో ఉన్న నాలాలు ఆధునికీకరణ చేపట్టాలని మేయర్ కమిషనర్‌ను ఆదేశించారు.
పలుచోట్ల నాలా పూడికతీత తీయకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు వర్షాకాలంలో ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. అందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్పీ రోడ్లో కొత్తగా చేపడుతున్న నాలా నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
బన్సీలాల్ పేట శ్మశానవాటికలో దహన ఖర్చులు ఎంత తీసుకుంటున్నారో మేయర్ అడిగి తెలుసుకున్నారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలకు ఎనిమిది వేల రూపాయలు, మామూలుగా చనిపోతే ఆరు వేల రూపాయలు తీసుకోవాలని కోరారు. అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, బేగంపేట డిప్యూటీ కమిషనర్ ముకుందా రెడ్డి, హెల్త్ అధికారి రవీందర్ గౌడ్, డీఈ ప్రవీణ్, స్థానిక భాజపా డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: revanth reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ