Hyderabad Jalamandali: హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లతో ఎండీ దానకిశోర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక మీదట నగరంలో రిసాలగడ్డలాంటి ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఎండీ అభిప్రాయపడ్డారు. నగరంలోని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కోర్ సిటీలో 378 సర్వీస్ రిజర్వాయర్లు ఉండగా, దాదాపు 100 రిజర్వాయర్ల ప్రాంగణాల్లోనే కార్యాలయాలు ఉన్నందున వాటిల్లో ఇప్పటికే 24 గంటల భద్రత ఉందన్నారు. మిగతా 278 రిజర్వాయర్లకు ఇప్పుడు పాక్షికంగా భద్రత ఉందని గుర్తించామని.. వీటి వద్ద కూడా 24 గంటల భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
సూచిక బోర్డుల ఏర్పాటు...
Jalamandali Md Danakishore: నగరంలోని రిజర్వాయర్ల ప్రాంగణాలు, వాటర్ ట్యాంకుల వద్దకు ఇతరులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఎలివేటెడ్ రిజర్వాయర్ల వద్ద పైకి వెళ్లే మెట్ల దగ్గర గేట్లు అమర్చి తాళం ఏర్పాటు చేసి బయటివారు రాకుండా చూడాలని సూచించారు. అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల బయట ఇతరులకు అనుమతి లేదని చెబుతూ నిషేధిత స్థలం అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్లలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మూతలు, గేట్లకు తప్పనిసరిగా తాళాలు వేయాలని సూచించారు.
రేపే గార్డుల నియామకం...
Hyderabad Jalamandali: రిజర్వాయర్ల వద్ద 24 గంటల భద్రత కోసం మరో 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను రేపే నియమిస్తున్నట్లు ఎండీ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఎజైల్ సంస్థకు టెండర్ ఖరారైందని తెలిపారు. వీరితో పాటు జలమండలిలోని వివిధ విభాగాల్లో సుమారు 200 మంది అదనపు సిబ్బందిని గుర్తించి.. వీరికి కూడా 15 రోజుల్లో రిజర్వాయర్ల ప్రాంగణాల్లో భద్రత పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ల తనిఖీకి నాలుగు ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్లయింగ్ స్వ్కాడ్లను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రన్‌రెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరు రాత్రి సమయాల్లో కూడా రిజర్వాయర్ ప్రాంగణాల్లో రక్షణ చర్యలను తనిఖీ చేస్తారని చెప్పారు.
600పైగా సీసీ కెమెరాలు...
నెల రోజుల్లో అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల్లో 600కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు ఎండీ తెలిపారు. ఈ సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసే విషయంపై పోలీసు శాఖతో సంప్రదిస్తామని పేర్కొన్నారు. దీనితో పాటు రానున్న 3 రోజుల పాటు సీజీఎం, జీఎం, విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో 21 బృందాలుగా ఏర్పడి అన్ని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. వీరు రిజర్వాయర్ల ప్రాంగణాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం అవసరమైన మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: