కరోనా వ్యాప్తిని నివారించడానికి హైదరాబాద్ గడ్డిఅన్నారం యార్డులో మామిడి, బత్తాయి మాత్రమే విక్రయాలకు అనుమతినిచ్చారు. పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి, దానిమ్మ అమ్మకాలకు ఉప్పల్ శిల్పారామం పక్కన హెచ్ఎమ్డీఏ భగాయత్ లే ఔట్లో మార్కెటింగ్ శాఖ తాత్కాలిక అవకాశం కల్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియక మలక్‌పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే అమ్ముకుంటున్నారు.
గత ఏడాది లాక్డౌన్.. ఆ తర్వాత భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులు.. కనీసం ఈ ఏడాదైనా గట్టెక్కుదామంటే.. కరోనా రెండోదశ పూర్తిగా దెబ్బతీసింది. మార్కెట్లో అమ్మకాలకు అనుమతులు లేకపోడవంతో రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నారు. గిట్టుబాటు రాక పూర్తిగా నష్టపోతున్నారు.
దీనికి తోడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసమే నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తమకు సరైన వేదిక చూపాలని రైతులు, వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పట్లో గడ్డిఅన్నారం నుంచి కోహెడకు మార్కెట్ తరలించే యోచన లేనందున సరైన ప్రత్యామ్నాయాలు చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్ హెల్ప్‌లైన్ డెస్క్