కరోనా ప్రభావంతో మార్చి చివరి వారం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు స్తంభించాయి. కార్గో విమానాలు మాత్రం యథావిధిగా తిరుగుతున్నాయి. కానీ సాధారణ రోజుల్లో జరిగినంత ఎక్కువ ఎగుమతులు, దిగుమతులు లేవు. కార్గో విమానాలు తిరుగుతున్నప్పటికీ అందులో కూడా ఎక్కువగా వైద్య, ఆరోగ్య రంగానికి చెందినవే ఉంటున్నాయి. అది కూడా కొవిడ్‌కు సంబంధించిన పరికరాలు, ముడిసరుకు, ఔషధాలు, వెంటిలేటర్లు లాంటివే సగానికిపైగా ఉంటున్నాయి. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొన్ని మాత్రమే దిగుమతి అవుతున్నాయి. కరోనా సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండరని భావించి కొందరు అక్రమార్కులు దొంగచాటుగా విలువైన బంగారు వస్తువులను, మాదకద్రవ్యాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను తెచ్చి భారత్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన కస్టమ్స్ ఉన్నతాధికారులు... మరింత అప్రమత్తంగా ఉండాలని ఇది వరకే స్పష్టం చేశారు.
వెలుగులోకి అక్రమాలు
ఇటీవల అమృతసర్ ఎయిర్ పోర్టులో రూ.3.5 కోట్లు విలువైన 10.22కిలోలు బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఎలతోపాటు వివిధ రకాల మాదకద్రవ్యాలు దిగుమతి పార్శిళ్ల తనిఖీల్లో పట్టుబడ్డాయి. హైదరాబాద్ సనత్‌నగర్ ఐసీడీ కార్గోలో కూడా అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ పార్శిల్‌పై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ పార్శిల్ చూస్తే సైజ్ పెద్దగా ఉండి... దాని ఇన్ వాయిస్‌లో కేవలం నాలుగు లక్షల ఆరు వేల విలువైన వస్తువులు అందులో ఉన్నట్లు ఉంది. దుబాయ్ నుంచి ఇక్కడికి ఎయిర్ పార్శిల్ రావాలంటేనే మూడు నాలుగు లక్షలు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని... అలాంటప్పుడు ఇంత తక్కువ విలువ చేసే వస్తువులను దుబాయ్ నుంచి ఎందుకు తెప్పించారన్న అనుమానం మరింత బలపడింది.
పార్శిల్ తెరిస్తే అసలు విషయం తెలిసింది
దుబాయ్ నుంచి హైదరాబాద్ దిగుమతి చేసుకున్న పాతబస్తీకి చెందిన మహ్మద్ సమీద్‌ను పలిపించి అధికారుల ఎదుటనే పార్శిల్‌ను తెరిపించారు. లగేజి బ్యాగులు, బ్లూటూత్ స్పీకర్లు, యుఎస్‌బీ కేబుల్స్, కీ ఛైన్లు, బొమ్మలు లాంటివి ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ లాంటివి ముందుస్తు అనుమతితోనే దిగుమతి చేసుకోవాల్సి ఉంది. కానీ అతనికి ఏలాంటి అనుమతి లేదు. ఆ వస్తువులను పరిశీలించిన అధికారులు... వాటి మొత్తం విలువ కోటి 24లక్షలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. దిగుమతి చేసుకున్న వస్తువుల విలువలో నాలుగు శాతం కూడా చూపకపోవడంపై దిగుమతిదారుడికి నోటీసు జారీ చేసి అతనిపై కేసు నమోదు చేశారు. అతనికి గతంలో ఎక్కడి నుంచైనా పార్శిల్స్ వచ్చాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో అధికారులకు లభించిన ఆధారాలను బట్టి పూర్తి విలువపై వందశాతం అపరాధ రుసుం విధించడంతో పాటు దానిపై ప్రభుత్వానికి రావాల్సిన ఎక్సైజ్ డ్యూటీని విధిస్తారు. ఇప్పటికే అతనికి నోటీసులు ఇచ్చిన అధికారులు... వ్యాపారానికి సంబంధించి తన దగ్గర ఉన్న పత్రాలతో హాజరు కావాలని స్పష్టం చేశారు.
మరింత క్షుణ్ణంగా
గత కొన్ని రోజులుగా వివిధ విమానాశ్రయాల్లో... పలు ఐసీడీ కార్గోల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఎగుమతులను, దిగుమతులను మరింత జాగ్రత్తగా పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అనుమానం వచ్చిన ప్రతి పార్శిల్‌ను కూడా తనిఖీలు నిర్వహించాలని విమానాశ్రాయలు, నౌకాశ్రయాలు, ఐసీడీ కేంద్రాల్లోని కస్టమ్స్ అధికారులకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బయట దేశాల నుంచి వచ్చే పార్శిళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: పసిడి కాస్త కనికరించింది- వెండి వెనక్కి తగ్గింది!